దిల్లీ పౌరచట్ట వ్యతిరేక ఘర్షణల్లో పదుల సంఖ్యలో మృతి చెందారు. 2వందల మందికి పైగా గాయాలయ్యాయి. గత నాలుగు రోజులుగా పరిస్థితులు సద్దుమణిగాయి. అల్లర్ల సందర్భంగా జనజీవనం అస్తవ్యస్తమయింది. దీనికి ఓ రిక్షా కార్మికుడి జీవితమే నిదర్శనం. ఫిబ్రవరి 23న హింసాత్మకంగా మారిన నిరసనల్లో మొయినుద్దీన్ అనే రిక్షా కార్మికుడి ఇంటికి, జీవనాధారమైన రిక్షాకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ కారణంగా అప్పటివరకు భార్య, నలుగురు పిల్లలతో గడిపిన మొయినుద్దీన్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఆ ఘటనలో భార్యా, నలుగురు పిల్లలు తప్పిపోయారు. ఈ నేపథ్యంలో ఓ దుకాణం వద్ద నాలా పక్కన పడుకుంటూ కష్టాలు పడుతున్నాడు మొయినుద్దీన్.
"నా కుటుంబం ఆచూకీ కోల్పోయింది. ఆందోళనలు తీవ్రమయిన నేపథ్యంలో సురక్షిత ప్రదేశానికి వెళ్లాలని నా భార్యకు సూచించాను. అప్పటి నుంచి వారి జాడ కన్పించడం లేదు. నా పరిస్థితిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. పరిస్థితులు సద్దుమణిగాక నా కుటుంబం ఆచూకీ తెలుస్తుందో.. లేదో చూడాలి. చాలామంది వారి కుటుంబాల కోసం వెతుకుతున్నారు. అల్లర్లు ప్రారంభమైన రోజే రూ. 2వేల విలువైన సరుకులు తీసుకొచ్చాను.. కానీ ఆందోళనల్లో మొత్తం పోయింది."
-మొయినుద్దీన్, రిక్షా కార్మికుడు
తన కుటుంబాన్ని ఆయా చోట్ల మొయినుద్దీన్ వెతుకుతున్నాడని అతడి బాగోగులు చూస్తున్న దుకాణ యజమాని చెప్పుకొచ్చాడు.
ఇదీ చూడండి: రక్షణ ఒప్పందాల్లో రష్యా, పోలాండ్ను వెనక్కి నెట్టిన భారత్!