జమ్ముకశ్మీర్‌లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అక్కడి పాలనా యంత్రాంగం రూ. 28,400 కోట్లతో నూతన పారిశ్రామిక అభివృద్ధి పథకాన్ని ప్రకటించింది. ఈ ప్రాంతపు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ పథకానికి ఆమోదం తెలిపిందని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. 2037వరకు ఈ పథకం అమల్లో ఉండనుందని స్పష్టం చేశారు.
క్షేత్రస్థాయి వరకు..
ఉపాధి కల్పన ద్వారా సామాజిక, ఆర్థిక అభివృద్ధికి బాటలు వేయాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశమని మనోజ్ సిన్హా వివరించారు. పెట్టుబడుల ఆకర్షణతో పాటు.. పారిశ్రామిక అభివృద్ధిని బ్లాక్ స్థాయి వరకు విస్తరించేందుకు వీలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జమ్ముకశ్మీర్‌లో సామాజిక, ఆర్థిక అసమానతలను రూపుమాపడానికి ఈ పథకం తోడ్పడుతుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. దీర్ఘకాలంలో వారిని అభివృద్ధి పథంలో నడిపించే పథకంగా ఇది నిలిచిపోతుంది.
-మనోజ్ సిన్హా, లెఫ్టినెంట్ గవర్నర్.
ఈ పథకం కింద.. రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిశ్రమలకు 5శాతం చొప్పున మూలధన సహాయాన్ని 5 సంవత్సరాల వరకు అందిస్తారు. ఈ ప్రాంతంలో తయారీ, సేవా రంగ పరిశ్రమల స్థాపన లక్ష్యంగా ఈ పథకం అమలు కానుంది.
ఇదీ చదవండి: జమ్ముకశ్మీర్‌ను కమ్మేసిన మంచు -స్తంభించిన జనజీవనం