మంటలు అంటుకున్న సమయానికి తల్లి అందుబాటులో లేక... ఏం చేయాలో, ఎటుపోవాలో పాలుపోక.. బుల్లి చిరుతలు అగ్ని జ్వాలలకి ఆహుతైపోయాయి. చిరుతలను గమనించకుండా పోగుచేసిన చెరకుతోట చెత్తకు రైతు నిప్పంటించటమే పసికూనల ప్రాణాలు బలయ్యేందుకు కారణమైంది. ఈ ఘటన ఇప్పుడు అందరి హృదయాలను కలచివేస్తుంది.
ఇదీ జరిగింది...
మహారాష్ట్రలోని పుణె జిల్లా జున్నార్ మండలం అవసారి గ్రామంలో జరిగిందీ ఘటన. ఓ చెరకు రైతు పొలంలో పోగుచేసిన చెరకు పంట చెత్తలో చిరుత కొద్ది రోజులుగా తన పిల్లలతో సహా ఆవాసం ఏర్పరుచుంది. చిరుత, కూనలు నివాసముంటున్న విషయాన్ని గమనించలేదు ఆ రైతు. తదుపరి పంట కోసం తన పొలంలో పోగుచేసిన ఆ చెత్తకు నిప్పుపెట్టి చదును చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు కొంతమంది కూలీలను నియమించారు. వాళ్లు కూడా చిరుత కూనలున్నట్లు గమనించకుండానే చెత్తకు నిప్పంటించారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న చిరుతల ఆవాసంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఏం జరుగుతుందో చిరుత పిల్లలకు అర్థం కాలేదు. తేరుకునే లోపే... క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ఎటూ వెళ్లలేక ఎగసి పడుతున్న అగ్ని జ్వాలలకు ఆహుతయ్యాయి పసికూనలు.