లెబనాన్ రాజధాని బీరుట్లో జరిగిన పేలుడులో ఐదుగురు భారతీయ పౌరులకు స్వల్ప గాయాలైనట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అక్కడి భారతీయులతో రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించింది.
"లెబనాన్‌లోని భారత పౌరులు ఎవరూ మరణించలేదు. ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. అక్కడి భారతీయులతో రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోంది. అవసరమైన సహాయం అందింస్తోంది."
-అనురాగ్ శ్రీవాస్తవ, విదేశాంగ శాఖ ప్రతినిధి
మరోవైపు పేలుడుకు వల్ల జరిగిన నష్టానికి సంబంధించి సమాచారం అందించాలని లెబనాన్ ప్రభుత్వాన్ని కోరినట్లు శ్రీవాస్తవ వెల్లడించారు. నష్ట సమాచారాన్ని బట్టి ఆ దేశానికి సాయం అందించనున్నట్లు స్పష్టం చేశారు.
130 మందికిపైగా
మంగళవారం జరిగిన పేలుడులో 130 మందికిపైగా మరణించారు. వేలాదిగా గాయపడ్డారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వ చేసిన ప్రాంతంలో మంటలు చెలరేగి.. పేలుడు సంభవించింది.