జామియా మిలియా విశ్వవిద్యాలయం (జేఎమ్యూ) ప్రాంగణంలోకి పోలీసులు అక్రమంగా ప్రవేశించి తమ విద్యార్థులపై లాఠీఛార్జి చేశారని..ఆ విశ్వవిద్యాలయ వీసీ నజ్మా అక్తర్ ఆరోపించారు. ఈ ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు డిమాండ్ చేశారు. తమ విశ్వవిద్యాలయం మీదుగా ఓ రహదారి ఉందని... అది ఉందికదా అని ఎవరుపడితే వాళ్లు ప్రాంగణంలోకి వచ్చి దాడులు చేయడం సరికాదని నజ్మా అన్నారు.
విశ్వవిద్యాలయంలో అనేక ఆస్తులు ధ్వంసం అయ్యాయన్నారు. ఈ మొత్తం ఘటనపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక సిద్ధం చేసి హెచ్ఆర్డీ మంత్రికి నివేదిస్తామని నజ్మా చెప్పారు. అత్యంత ప్రశాంతంగా ఉండే విశ్వ విద్యాలయంలోకి పోలీసులు ఇకపై రాకూడదని.. విశ్వవిద్యాలయ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించకూడదని కోరారు.
"పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. అనుమతి లేకుండా పోలీసులు జామియా మిలియా విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించడానికి లేదు. మా విశ్వవిద్యాలయానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. అనేక వస్తువులు ధ్వంసం అయ్యాయి. ఈ నష్టాన్ని ఎవరు పూడుస్తారు. మా ప్రతిష్ఠకు కూడా నష్టం వాటిల్లింది. లైబ్రరీలో కూర్చొని చదువుకుంటున్న అమాయాక విద్యార్థులపైనా లాఠీఛార్జి చేశారు. దీనిపై అత్యున్నత స్థాయి దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాం. ఈ ఘటనలో బాధ్యులెవరో తేల్చి కఠినచర్యలు తీసుకోవాలి."
-నజ్మా అక్తర్, జామియా మిలియా విశ్వవిద్యాలయం ఉపకులపతి