కరోనా వైరస్ విజృంభణతో భయం గుప్పిట్లో బతుకుతున్న జనం ఆశలన్నీ వ్యాక్సిన్ పైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లకు సంబంధించి నీతి ఆయోగ్ ఓ శుభవార్త చెప్పింది.
దేశంలో మొత్తం మూడు వ్యాక్సిన్ల అభివృద్ధి వివిధ దశల్లో ఉందని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చెప్పగా.. వీటిలో ఓ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌కు సిద్ధమైనట్టు నీతి ఆయోగ్ ప్రతినిధి వీకే పాల్ వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో మూడో దశ ట్రయల్స్ ప్రారంభమవుతాయని స్పష్టంచేశారు. మిగిలిన రెండు వ్యాక్సిన్లు మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నట్టు ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.
దేశంలో ఇప్పటికే భారత్ బయోటెక్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జైడస్ క్యాడిలాతో పాటు పలు సంస్థలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి.
భవిష్యత్తులో ప్రభావం!
వ్యాధికి సంబంధించిన కొత్త కోణాలను శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారని వీకే పాల్ తెలిపారు. వైరస్ ప్రభావం రికవరీ తర్వాత కూడా కొంతమేర ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఈ ప్రభావం ప్రమాదకరంగా లేదని పేర్కొన్నారు. కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత బాధితుల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చారు పాల్.
మహమ్మారికి వ్యతిరేకంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్స విధానాలను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు పాల్. భవిష్యత్ ప్రభావంపై మరింత సమాచారం అందిన తర్వాతే అర్థం చేసుకునే వీలు కలుగుతుందని.. అప్పుడే స్పష్టంగా వివరించే అవకాశం లభిస్తుందని అన్నారు.
ఇదీ చదవండి- కరోనా పంజా: తమిళనాట 6 వేలకు మరణాలు