ఆసియాలోనే అతిపెద్ద దేశాలైన భారత్, చైనా మధ్య కొద్ది నెలలుగా సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు లద్దాఖ్ పర్వత ప్రాంతంలో మౌలిక వసతుల నిర్మాణం, వాటిని మెరుగుపరుచుకోవడం భారత్‌కు అత్యంత సున్నితమైన అంశం. అయితే కఠిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వీటి నిర్మాణాలను భారత్ ఆలస్యం చేసిన అనంతరం ఎట్టకేలకు యుద్ధప్రాతిపదికన కొత్త రోడ్ల నిర్మాణం చేపడుతోంది.
చైనా సరిహద్దును తాకే కారాకోరం పాస్ సమీపంలోని దౌలత్ బేగ్ ఓల్దీ వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను మరింత వేగవంతం చేశారు అధికారులు. దీంతో పాటే లద్దాఖ్‌లోని సున్నితమైన ప్రాంతాలైన లేహ్, కార్గిల్‌లో మొత్తం 36 కొత్త హెలిప్యాడ్లను నిర్మించనున్నారు.
లేహ్‌లో 19, కార్గిల్‌లో 17 హెలిప్యాడ్లను వచ్చే నాలుగు నెలల్లో పూర్తి చేయనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
యుద్ధ విమానాలకు అనువుగా..
కొత్తగా నిర్మిస్తోన్న హెలిప్యాడ్లు సాధారణమైనవి కావు. సామాన్య పౌరుల అవసరాలు తీర్చేందుకు, పర్యటకులను తీసుకెళ్లేందుకు, మెడికల్ ఎమర్జెన్సీకి, అత్యవసర పరిస్థితుల్లో సైనిక హెలికాప్టర్లు వినియోగించుకునేందుకు వీలుగా అన్ని సదుపాయాలతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
కొత్తగా నిర్మించే ఒక్కో హెలిప్యాడ్‌లో కనీసం రెండు ఎంఐ-17 యుద్ధవిమానాలను పార్కింగ్ చేసేందుకు వెసులుబాటు ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రీఫ్యుయెలింగ్ స్టేషన్లుగా కూడా వీటిని ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నాయి. ఇతర సదుపాయాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయని చెప్పాయి.
రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న ఎంఐ-17 యుద్ధవిమానం రెక్కలు కనీసం 23 మీటర్ల పొడవుంటాయి. వీటి ద్వారా ఒకేసారి 30మంది సైనికులను తరలించవచ్చు.
"హెలికాప్టర్లను సాధారణంగా ఎక్కడైనా ల్యాండ్ చేయొచ్చు. కానీ ఎత్తైన పర్వత ప్రాంతాలున్న లద్దాఖ్‌లో ఇది సవాల్‌తో కూడుకున్న పని. అందుకే అన్ని సౌకర్యాలతో లద్ధాఖ్లోని అన్ని ప్రాంతాలను అనుసంధానించేలా నూతన హెలిప్యాడ్లను తక్షణమే నిర్మించాల్సిన అవసరం ఉంది."
- అధికారిక వర్గాలు
చైనాకు దీటుగా సరిహద్దులో మనం మోహరించిన బలగాలకు అవసరమైన సరఫరాలు చేసేందుకు ఈ కొత్త హెలిప్యాడ్లు ఎంతో ఉపయోగపడనున్నాయి. శీతాకాలంలో వీటి అవసరం అత్యంత కీలకంగా మారనుంది.
లేహ్‌లోని ప్రధాన కుశక్ బకులా రిన్పోచే విమనాశ్రయంతో పాటు, లద్దాఖ్‌లోని ఆరు అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్స్(ఏఎల్జీ)లను భారత వాయుసేన నిర్వహిస్తోంది. యుద్ధ విమానాలను ఇక్కడ కూడా ల్యాండ్ చేయొచ్చు. అయితే ప్రధానంగా వీటిని ఇతర యుద్ధ విమానాల రవాణా కోసం వినియోగిస్తోంది.
డ్రాగన్ కూడా..
చైనా కూడా సైనిక అవసరాలను గుర్తించి నూతన హెలిప్యాడ్ల నిర్మాణ పనులను ముమ్మరం చేసింది. లద్ధాఖ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులలో కొత్త హెలిప్యాడ్, హెలిపోర్టులను నిర్మించేందుకు సిద్దమైంది.
అమెరికా నిఘా సంస్థ స్ట్రాట్‌ఫర్ సెప్టెంబర్‌లో వెల్లడించిన నివేదిక ప్రకారం వాస్తవాధీన రేఖ వెంబడి చైనా నాలుగు కొత్త హెలిప్యాడ్లను నిర్మిస్తోంది.
ఎనిమిది నెలలుగా సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామాలు అత్యంత కీలకంగా మారాయి.
- సంజయ్ బారువా, సీనియర్ జర్నలిస్ట్