తూర్పు లద్దాఖ్ వద్ద ఘర్షణాత్మక వాతావరణాన్ని తగ్గించడంలో ప్రధాన బాధ్యత చైనాదేనని భారత్ తేల్చి చెప్పింది. చైనా తన సైనికులను వెనక్కి పంపి ఉద్రిక్తతలు తగ్గించేందుకు చొరవ చూపాలని కమాండర్ల భేటీలో భారత సైన్యం స్పష్టం చేసిందని అధికారులు తెలిపారు.
దాదాపు రెండున్నర నెలల తర్వాత ఇరుదేశాల కమాండర్ స్థాయి అధికారుల మధ్య చైనా సరిహద్దు వైపు తొమ్మిదో విడత చర్చలు జరిగాయి. ఆదివారం ఉదయం 10 గంటలకు మొదలైన ఈ సమావేశం.. దాదాపు 11 గంటల పాటు సాగింది. భారత్ తరపున చర్చలకు.. 14వ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ నేతృత్వం వహించారు.
ఏప్రిల్‌కు పూర్వం లద్దాఖ్‌లో ఉన్న స్థితినే పునరుద్ధరించాలని చర్చల్లో భారత్ డిమాండ్ చేసింది. అన్ని ఘర్షణ ప్రాంతాల్లో ఒకేసారి బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం కావాలని స్పష్టం చేసింది.
ప్రతిష్టంభన
ఇరు దేశాల నుంచి దాదాపు లక్ష మంది సైనికులు లద్దాఖ్ సరిహద్దుల్లో మొహరించి ఉన్న నేపథ్యంలో... ఉద్రిక్తతలను నివారించేందుకు భారత్-చైనా చర్చలు సాగిస్తున్నాయి. సమస్య పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్లు భారత్ పదేపదే స్పష్టం చేస్తోంది. అయితే సైనికుల ఉపసంహరణ చైనానే తొలుత ప్రారంభించాలని చెబుతోంది.