భారత్, చైనా మధ్య ఏడో దఫా ఉన్నత స్థాయి సైనిక చర్చలు జరుగుతున్నాయి. తూర్పు లద్దాఖ్‌లోని సమస్యాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ కార్యాచరణ ఖరారు చేసే ఏకైక అజెండాతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.
తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ సమీపంలోని చుశూల్‌లో ఈ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. భారత్ తరఫున 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి నవీన్ శ్రీవాస్తవ పాల్గొన్నారు.
వ్యూహాలపై నిర్ణయం..
ఇప్పటికే చైనా అధ్యయన బృందం (సీఎస్జీ)... సైనిక చర్యల్లో భారత్ అనుసరించాల్సిన వ్యూహాన్ని శుక్రవారం ఖరారు చేసింది. ఈ బృందంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్, సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు సభ్యులుగా ఉన్నారు.
ఇదీ చూడండి: చైనాతో చర్చలకు ముందు అత్యున్నత స్థాయి సమావేశం
సరిహద్దుల్లో ఏప్రిల్‌కు ముందు నాటి పరిస్థితిని పునరుద్ధరించాలని భారత్ డిమాండ్ చేయనుందని సైనిక వర్గాలు తెలిపాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో చైనా దళాలను ముందుగా వెనుదిరిగేలా ఒత్తిడి చేస్తుందని స్పష్టం చేశాయి. పాంగాంగ్ సరస్సు శిఖరాలపై బలగాలను వెనుదిరగాలని చైనా డిమాండ్ చేస్తే భారత్ గట్టిగా వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: చైనా తీరు మారే వరకు.. ఆ శిఖరాలపైనే పాగా!
ఆరో దఫా చర్చల్లో..
ఇరు దేశాల మధ్య సెప్టెంబర్ 21న జరిగిన చర్చల్లో ముఖ్పరి, రెజాంగ్లా, మగర్ హిల్ వంటి ప్రాంతాలనుంచి వెనక్కు వెళ్లాలని భారత్‌ను డిమాండ్ చేసింది చైనా. భారత్ మాత్రం రెండువైపులా ఒకేసారి ఉపసంహరణ జరగాలని పట్టుబట్టింది.
ఇదీ చూడండి: భారత్-చైనా ఏకాభిప్రాయం- ఒప్పందాల అమలుకు అంగీకారం!
ఈ చర్చల్లో సరిహద్దులకు అదనపు బలగాలను తరలించకపోవటం, ఏకపక్షంగా యథాతథ స్థితిని మార్చే ప్రయత్నాలకు దూరంగా ఉండటం, ఉద్రిక్తతలు పెంచే విధంగా ఎలాంటి చర్యలకు పూనుకోకపోవటం వంటి అంశాలపై ఇరుదేశాల అధికారులు కీలక నిర్ణయాలను ప్రకటించారు.
5 నెలలు గడిచినా..
ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన మొదలై 5 నెలలు పూర్తయినా ఇప్పటికీ బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కాలేదు. ఓ వైపు సైనిక, దౌత్య స్థాయి చర్చలు జరుగుతున్నా... తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాలు లక్ష మంది బలగాలను మోహరించాయి. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తినా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాయి.
ఇదీ చూడండి: అధినేతల చర్చలతోనే సరిహద్దు సమస్యకు చెక్!