రాజస్థాన్లోని కోటా జేకే లోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో శిశు మరణాల విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఆసుపత్రిలో డిసెంబర్ ఒక్క నెలలోనే ఏకంగా 100 మంది చిన్నారులు మరణించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు ముమ్మరం చేసింది. ప్రభుత్వంపై విమర్శలు పెరిగిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ స్పందించారు. ఈ ఘటనపై రాజకీయాలు చేయడం మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు. పరిస్థితి మెరుగుపర్చడానికి కేంద్ర సహాయాన్ని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో మెరుగైన వైద్య సదుపాయాల కోసం ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేలా కేంద్రం నుంచి ప్రత్యేక బృందాన్ని ఆహ్వానిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
సహాయానికి కేంద్రం సంసిద్ధం...
మరోవైపు ఈ విషయంపై కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్పందించారు. పిల్లల మరణాలపై సత్వర చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ ముఖ్యమంత్రికి సూచించినట్లు వివరించారు. దీనిపై ఆయనకు లేఖ రాసినట్లు వెల్లడించారు. క్రితం ఏడాదితో పోలిస్తే మరణాల సంఖ్య పెరిగిందన్నారు. కేంద్రం నుంచి అవసరమైన సహాయాన్ని అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ప్రియాంక గాంధీ.. మౌనం?
జేకే లోన్ ఆసుపత్రిలో పిల్లల మృతిపై రాజస్థాన్ ప్రభుత్వాన్ని విమర్శించారు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి. ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్లే శిశుమరణాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఈ విషయంపై మౌనంగా ఎందుకు ఉంటున్నారని... కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ప్రశ్నించారు.
"కోటాలో 100 మంది పిల్లల మరణం బాధాకరం. గహ్లోత్ ప్రభుత్వం దీనిపై బాధ్యతారాహిత్యంగా ఉంది. దీన్ని ఖండిస్తున్నాం. ఈ ఘటనపై కాంగ్రెస్ అధిష్ఠానం, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించకపోవడం అంతకన్నా బాధాకరం. ప్రియాంక ఉత్తర్ప్రదేశ్లో చేసినట్లుగానే రాజస్థాన్లోనూ మృతుల కుటుంబాలను పరామర్శిస్తే బాగుండేది."
-మాయావతి, బీఎస్పీ అధినేత్రి
ఇదీ చదవండి: ఆగని 'కోటా' మరణాలు.. సమస్యకు పరిష్కారమేది!