కేరళలో జరిగిన వరుస హత్యల కేసులో ప్రధాన నిందితురాలు జాలీ జోసెఫ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం నిర్బంధంలో ఉన్న ఆమె ఇవాళ ఉదయం తన చేతిని పదునైన ఆయుధంతో కోసుకుంది.
జాలీ చేతినుంచి రక్తం కారుతుండడాన్ని గుర్తించిన జైలు సిబ్బంది.. ఆమెను కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. శస్త్రచికిత్స చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాలీకి ఆయుధం ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.
ఇదీ జాలీ కథ..
కేరళ కూడథాయిలో 17 ఏళ్ల కాలంలో తన కుటుంబానికి చెందిన ఆరుగురిని పలు రకాలుగా హత్య చేసింది. ఆస్తి కోసం అత్త, మామ, సొంత భర్తను కూడా వదల్లేదు. జాలీ దురాగతాలను ఆమె మరిది ఫిర్యాదు మేరకు 17 ఏళ్ల తర్వాత ఛేదించారు పోలీసులు.
2002లో మొదట విశ్రాంత ఉద్యోగి టామ్ థామస్ భార్య అన్నమ్మన్ భోజనం చేసిన అనంతరం కుప్పకూలి చనిపోయారు. ఆ తర్వాత ఆరేళ్లకు టామ్ కూడా ఇదే విధంగా మృతి చెందారు. ఆ తర్వాత వారి కుమారుడు రాయ్ థామస్, 2014లో మాథ్యూ ఇలా వరుసగా మృత్యు ఒడికి చేరారు. ఇలా మొత్తం ఆరు హత్యలు చేసింది జాలీ.
ఈ కేసులో జాలీతో పాటు మరో ఇద్దరిని గతేడాది అక్టోబర్లో అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరంతా కోజికోడ్ జైలులో ఉన్నారు.
ఇదీ చూడండి: 'జాలి' లేని జాలీ - వరుస హత్యల కేసులో నేరాంగీకారం