స్వరాజ్య సముపార్జన నిమిత్తం ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమం లక్ష్యం అనతికాలంలో నెరవేరినా, స్వేచ్ఛాభారత్ మిషన్‌లో విజయం సాధించామా అనే విషయాని అవలోకనం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అవినీతి, అసమానతలు, పేదరికం, నిరక్షరాస్యత, లింగభేదం, సాంఘిక వివక్ష వంటి జాడ్యాలను దేశం నుంచి పారద్రోలాలని పిలుపునిచ్చారు. అదే క్విట్ ఇండియా స్ఫూర్తని స్పష్టంచేశారు.
'నా మనోగతం'లో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి పలు అంశాలను ఆదివారం సామాజిక మాధ్యమం ద్వారా వెంకయ్యనాయుడు పంచుకొన్నారు.
"మాతృదేశం, మాతృభాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల అభిమానాన్ని పెంచుకోవడమే స్వరాజ్య సంగ్రామ స్ఫూర్తి. గతం నుంచి సరైన పాఠాలు నేర్చుకుని బలమైన భవిష్యత్తు నిర్మాణం దిశగా ప్రయత్నాలు చేస్తేనే ఏ నాగరికత అయినా ఉన్నత మార్గంలో ముందుకు సాగుతుంది. కొత్త అనుభవ పాఠాలతో దీని కోసం సిద్ధం కావాలి. మనం స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు సాగించిన పోరాటంలో అమరులైన అందరికీ నివాళులు అర్పిస్తున్నా"
-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
ఆగస్టుకు ప్రత్యేక స్థానం
భారతదేశ ఆధునిక చరిత్రలో ఆగస్టుకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు వెంకయ్య. 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం కాగా 1947 ఆగస్టులో దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ పలికిన 'డూ ఆర్ డై' చిన్న నినాదం దేశ ప్రజల అపోహలన్నింటినీ తొలగించిందని... మరోవైపు, దాదాభాయ్ నౌరోజి, ఫిరోషా మెహతా, దిన్షా వాచా, సురేంద్రనాథ్ బెనర్జీ, లాలా లజపతిరాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్, భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్‌చంద్ర బోస్‌లు వివిధ వర్గాలకు చెందిన యువతను స్వాతంత్య్ర సాధన దిశగా ప్రోత్సహించారని గుర్తు చేశారు.
"78 సంవత్సరాల క్రితం ఆగస్టు నెలలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. తర్వాత ఐదేళ్లలో దేశం స్వాతంత్య్రం సంపాదించుకుంది. జాతి జనుల స్వేచ్ఛకు ముందుకు సాగిన సుదీర్ఘమైన భారత జాతీయ ఉద్యమం, మనల్ని మనమే పరిపాలించుకోగల సామర్థ్యం, సొంత గమ్యాన్ని రూపొందించుకొనే సామర్థ్యంపై అంతర్గత విశ్వాసం ద్వారా ప్రేరణ పొందింది."
-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
గతాన్ని గుర్తుంచుకోవాలి
క్విట్ ఇండియా కన్నా ముందు వెయ్యేళ్లపాటు దేశం ఎలా చీకటిలోకి వెళ్లిపోయిందో కూడా గుర్తు చేసుకోవడం అవసరమని అన్నారు వెంకయ్య. క్రీ.శ.1000లో గజనీ మహ్మద్ దండ్రయాత్రలు, ఘోరి, చెంఘీజ్ ఖాన్ తైమూర్‌ల దోపిడీల తర్వాత 1526లో బాబర్ నేతృత్వంలో మొఘల్ పాలన ప్రారంభమైందని.... తదనంతరం పృథ్వీరాజ్, మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ తదితరులు ఎంత ప్రతిఘటించినా దేశంలోని సింహభాగం విదేశీ ఆక్రమణదారుల పాలనలోకి వెళ్లిందన్నారు.
"17వ శతాబ్దంలో ఈస్ట్‌ఇండియా సంస్థ వ్యాపారం పేరుతో అడుగుపెట్టి ప్లాసీ యుద్ధంతో ఒక్కో ప్రాంతంపైనా పట్టు సాధించడం ప్రారంభించింది. ఝాన్సీ లక్ష్మీభాయి మొదటి స్వాతంత్య్ర యుద్ధానికి సూచికగా సాహసోపేతమైన పోరాటం చేసినా 1858 నాటికి భారతదేశం బ్రిటిష్ పాలనలోకి వచ్చేసింది. 90 ఏళ్లపాటు సంపద దోపిడీ కొనసాగింది. వెయ్యేళ్లపాటు దేశంలోని సంస్కృతిపైనా దాడులు జరిగాయి."
-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
నేటికీ పర్యవసానాలు
దేశంలో సాంఘిక అంతరాలు సృష్టించడంతోపాటు సంస్కృతి సంప్రదాయాలను కూకటివేళ్లతో పెకిలించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు వెంకయ్య. సోమనాథ్ ఆలయ పునరుద్ధరణకు 925 ఏళ్లు పడితే రామజన్మభూమిలో ఆలయ నిర్మాణానికి 500 ఏళ్లు పట్టిందని పేర్కొన్నారు. బ్రిటిష్ హయాంలో వారి ప్రయోజనాల నిమిత్తం కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టారని... నేటికీ ఆ పర్యవసానాలు అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
"స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాల సందర్భాన్ని ఉత్సవంగా నిర్వహించుకునే దిశగా మనం ముందుకు వెళుతున్న నేపథ్యంలో అవినీతి, అసమానతలు, పేదరికం, నిరక్షరాస్యత, లింగబేధం, సాంఘిక వివక్ష వంటి జాడ్యాలను దేశం నుంచి పారద్రోలాలి. అదే క్విట్ ఇండియా స్ఫూర్తి. మాతృదేశం, మాతృభాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల అభిమానాన్ని పెంచుకోవడమే స్వరాజ్య సంగ్రామ స్ఫూర్తి."
-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
గతం నుంచి సరైన పాఠాలు నేర్చుకుని బలమైన భవిష్యత్తును నిర్మించుకొనే దిశగా ప్రయత్నాలు చేస్తేనే ఏ నాగరికత అయినా ఉన్నత మార్గంలో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య. కొత్త అనుభవ పాఠాలతో దీని కోసం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. స్వేచ్ఛా వాయువులు పీల్చుకొనేందుకు సాగించిన పోరాటంలో అమరులైన అందరికీ నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.