కుండపోత వర్షాల కారణంగా కేరళలో పోటెత్తిన వరదలు రాష్టాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు వర్షాలు, వరదలకు 43 మంది చనిపోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదల ధాటికి రాష్ట్రంలో వేల ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
వర్షాలు కాస్త తగ్గినా ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో వరదనీరు అలాగే ఉంది. జనావాసాలతో పాటు రోడ్లపై ఇంకా నీటి ప్రవాహం కొనసాగుతోంది. మొత్తం 988 పునరావాస కేంద్రాల్లో దాదాపు 1,07,699 ఆశ్రయం పొందుతున్నారు.
మలప్పురం జిల్లాలో...
మలప్పురం జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి . ప్రతికూల వాతావరణం.. సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది. ఈనెల 8 నుంచి కురుస్తోన్న భారీవర్షాలకు ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఎన్డీఆర్ఎఫ్, సైన్యం సహాయ చర్యలు చేపడుతున్నాయి.
వయనాడ్‌లో...
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రదేశాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ఇక్కడ భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మెప్పాడి సమీపంలోని పుథుమాల ప్రాంతంలో దాదాపు 1000 మందిని కాపాడారు. ఇక్కడ 2 రోజుల క్రితం ఇళ్లు, గుడి, మసీదుపై భారీ కొండచరియలు విరిగి పడ్డాయి.
రెడ్ అలర్ట్...
ఎర్నాకులం, ఇడుక్కి, పాలక్కడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కాన్నుర్ జిల్లాల్లో ఇప్పటికీ రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. రైలు పట్టాలు వరద నీటిలో మునిగిపోవడం వల్ల దక్షిణ రైల్వే పలు రైళ్ల రాకపోకలను నిలిపివేశాయి.
రాహుల్ రాక...
వయనాడ్, మలప్పురంలోని వరద బాధిత ప్రాంతాలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రేపు సందర్శించనున్నారు.
- ఇదీ చూడండి: రెండోరోజూ వరుణుడి బీభత్సం...32 మంది మృతి