నలుగురు పిల్లలు ప్రమాదవశాత్తు ఓ కారు లోపల చిక్కుకుపోగా... అందులో ఇద్దరు చిన్నారులు ఊపిరాడక మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా నాలుగు నుంచి ఏడేళ్ల లోపు వారేనని వెల్లడించారు పోలీసులు. ఈ విషాద ఘటన ఉత్తర్ప్రదేశ్ ముండాపాండే గ్రామంలో జరిగింది.
ఏం జరిగింది?
వివరాల్లోకి వెళ్తే.. ఓ కుటుంబం ఆదివారం సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసింది. వారింట్లో ఉన్న నలుగురు చిన్నారులు సోమవారం మధ్యాహ్నం ఆడుకుంటూ ఆ కారు డోర్తీసి లోపలికి వెళ్లారు. అనంతరం.. కారు డోర్ లాక్ అవడం వల్ల బయటకు రాలేక చిక్కుకుపోయారు. బయటకువెళ్లిన చిన్నారులు ఎంతసేపటికీ తిరిగి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. పిల్లలు కారులో ఉన్నట్లు గుర్తించారు. ఊపిరాడక అపస్మారక స్థితిలో ఉన్న వారందరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఇద్దరు పిల్లలు చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు.
పిల్లలు.. కారు లోపల రెండు గంటలు చిక్కుకుపోయి, ఆక్సిజన్ లేకపోవడం వల్లే ఉక్కిరిబిక్కిరి అయ్యారని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: భారత్, చైనా సైనికుల ఘర్షణ- ముగ్గురు జవాన్ల మృతి