ఆయనో బ్యాచిలర్.. రాష్ట్రానికి ముఖ్యమంత్రే అయినా సొంత వాహనం కూడా లేదు.. చేతిలో నగదు రూ.15వేలే.. ఆయనే హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్. హరియాణాలో ఈ నెల 21న ఎన్నికలు జరగనుండటంతో కోలాహలం మొదలైంది. అధికార, ప్రతిపక్షాలకు చెందిన నేతల నామినేషన్ల పర్వం జోరందుకుంది. ఎన్నికల్లో అధికార భాజపా తరఫున కర్నాల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న 65ఏళ్ల ఖట్టర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి ఆయన సమర్పించిన నామినేషన్ పత్రాల్లో తన ఆస్తుల వివరాలను ఆయన వెల్లడించారు. తన మొత్తం ఆస్తుల విలువ రూ.1.27 కోట్లుగా పేర్కొన్నారు. అందులో రూ.94 లక్షలు చరాస్తులు కాగా, రూ.33 లక్షలు స్థిరాస్తులు అని వెల్లడించారు. 2014 ఎన్నికల్లో సమర్పించిన నామినేషన్ పత్రాల్లో తన చరాస్తుల విలువ రూ.8,29,952 కాగా.. ఈ ఏడాది ఆ ఆస్తులు రూ.94,00,985కి పెరిగినట్టు ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
బకాయిలేం లేవు...
అలాగే, రోహ్‌తక్ జిల్లాలోని తన సొంత గ్రామం బినాయినిలో రూ.30 లక్షలు విలువ చేసే వ్యవసాయ భూమితో పాటు 800 చదరపు అడుగుల ఇల్లు ఉన్నట్టు వెల్లడించారు. ఆ ఇంటి మార్కెట్ విలువ రూ.3 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. తనపై ఎలాంటి కేసులూ లేవని.. సొంత వాహనం కూడా లేదని అఫిడవిట్‌లో ప్రకటించారు. తాను దిల్లీ వర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశానని.. చేతిలో రూ.15000 నగదు మాత్రమే ఉన్నట్టు తెలిపారు. బ్యాంకు రుణాలూ తనకు లేవన్నారు. చండీగఢ్‌లో తనకు ప్రభుత్వం కేటాయించిన ఇంటికి సంబంధించి అద్దె, విద్యుత్, తాగునీరు, టెలీఫోన్ ఛార్జీలకు సంబంధించి ఎలాంటి బకాయిలూ లేవని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి : యుగపురుషుడికి ఎయిర్ ఇండియా గ'ఘన' నివాళి