కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్, జేడీ(ఎస్) కూటమిలోని విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఎప్పుడో ముఖ్యమంత్రి కావాల్సిందని, ఆయనకు తీవ్ర అన్యాయం జరిగిందని, సీఎం కుమారస్వామి తాజాగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది.
కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని ఆశిస్తున్న వేళ, కుమార స్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అధికార కూటమిలోని విబేధాలు, ముఖ్యమంత్రి కుమారస్వామి తాజా వ్యాఖ్యలు భాజపాకు అస్త్రంగా మారాయి. కుమారస్వామి వెంటనే ముఖ్యమంత్రి పీఠాన్ని మల్లికార్జున ఖర్గేకు అప్పగించాలని భాజపా నేత బీఎస్ యడ్యూరప్ప చురకలంటించారు.
చించోలీ అసెంబ్లీ నియోజవర్గం ఉపఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ నిర్వహించిన ఓ బహిరంగసభలో ముఖ్యమంత్రి కుమారస్వామి పాల్గొన్నారు.
"మల్లికార్జున ఖర్గే 9సార్లు ఎమ్మెల్యే, 2 పర్యాయాలు లోక్సభ ఎంపీ. ఆయనకు ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ ఓటమి అంటే తెలియదు. ఎప్పుడో ముఖ్యమంత్రి కావాల్సినవారు. అతనికి అన్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఎంత సేవ చేసినా, అందుకు తగ్గ గుర్తింపు పొందలేకపోయారని కచ్చితంగా చెప్పగలను."-కుమారస్వామి, కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) అధినేత
కుమారస్వామి వ్యాఖ్యలపై సంకీర్ణ సమన్వయ కమిటీ ఛైర్మన్, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య స్పందించారు. పార్టీలోని మద్దతుదారుల ప్రేమవల్లే గతంలో తాను ముఖ్యమంత్రిని అయ్యానని అన్నారు. మాట ఇచ్చిన ప్రకారం వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయబోవడం లేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: గుడ్లు పొదిగిస్తే 16 పాములు పుట్టుకొచ్చాయ్!