ఇప్పడు పుస్తకంలో రాసుకునే రోజులు పోయాయి. కంప్యూటర్, ల్యాప్టాప్, ట్యాబ్స్ అంటూ ఎన్నో అత్యాధునిక పరికరాలు వచ్చాయి. ఈ తరం వారు పెన్ను కన్నా కీబోర్డులే ఎక్కువ ఉపయోగిస్తున్నారు. కానీ దీర్ఘకాలంలో ఇది ఎంతో ప్రమాదకరమని పరిశోధనల్లో తేలింది.
పాఠశాలలు, ఆఫీసులు, రైల్వే కౌంటర్లు... ఇప్పుడు ఎటు చూసినా కంప్యూటర్లే దర్శనమిస్తున్నాయి. రోజంతా కీబోర్డుతోనే పని. కానీ వారంలో 10గంటలకన్నా ఎక్కువ సేపు కీబోర్డు ఉపయోగిస్తే పెద్ద సమస్యే వస్తుందని దిల్లీ ఎయిమ్స్ వైద్యులు హెచ్చరిస్తున్నారు. మెడ, చేతుల నోప్పి వస్తాయంటున్నారు. దీర్ఘకాలంలో ఇది ఎంతో ప్రభావం చూపుతుందని తెలిపారు.
ఎముకలు దెబ్బతినడం వల్లే ఈ సమస్య ఏర్పడుతుందని ఎయిమ్స్ ఆసుపత్రి ఎముకల విభాగ అసిస్టెంట్ ప్రోఫెసర్ వైద్యుడు వివేక్ శంకర్ అన్నారు. పని చేసే విధానాల్లో మార్పులు రావడమే ఇందుకు కారణమన్నారు.
"ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఈ సమస్య వేగంగా వ్యాపిస్తోందని ఎన్నో నివేదికలు తెలిపాయి. పని చేసే విధానంలో మార్పులు రావడమే ఇందుకు కారణం. కంప్యూటర్, ల్యాప్టాప్ ఎక్కువ ఉపయోగిస్తున్నాం. వ్యాయామం బాగా చేయాలి. ప్రతి అరగంట పాటు పని నుంచి విశ్రాంతి తీసుకోవాలి. మోచేయి, మణికట్టు వ్యాయామం చేయాలి. ఈ సమస్యతో బాధపడుతున్న వారు పని నుంచి కనీసం 15 రోజులు విశ్రాంతి తీసుకోవాలి. మణికట్టును వాడకూడదు. చన్నీటితో మర్దన చేసుకోవాలి. వైద్యుడిని సంప్రదించాలి."
--- వివేక్ శంకర్, దిల్లీ ఎయిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్
జాగ్రత్త వహించక పోతే ఎముకలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరించారు వివేక్.