భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి దాదాపు 300 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. మళ్లీ అధికారం చేపడుతుందని స్పష్టం చేశాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు నిరాశ తప్పదని తేల్చేశాయి. కీలక రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బంగాల్, బిహార్, దిల్లీలలో భాజపా హవా ఉండడమే ఇందుకు కారణమని అంచనాలు వేశాయి.
మహారాష్ట్ర
మహారాష్ట్రలో మొత్తం లోక్‌సభ స్థానాలు 48. ఆ రాష్ట్రంలో భాజపా-శివసేన కలిసి పోటీకి దిగాయి. ఆ పార్టీల ఎన్డీఏ కూటమికే ప్రజల మద్దతు ఉందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. రాష్ట్రంలో మోదీ ప్రభంజనం తగ్గినప్పటికీ... శివసేన భారీగా సీట్లు పొందుతుందని అంచనా వేశాయి. ఎన్సీపీతో కలిసి బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీకి నిరాశ తప్పదని చెప్పాయి.
ఎగ్జిట్ పోల్స్ | ఎన్డీఏ | యూపీఏ | ఇతరులు |
టైమ్స్ నౌ | 38 | 10 | 0 |
సీ-ఓటర్ | 34 | 14 | 0 |
ఎన్డీ టీవీ | 36 | 11 | 1 |
జన్ కీ బాత్ | 38 | 9 | 1 |
పశ్చిమ బెంగాల్
బంగాల్లో మొత్తం లోక్‌సభ సీట్ల సంఖ్య 42. సార్వత్రిక ఎన్నికల ఏడు దశల్లోనూ పోలింగ్ జరిగింది. ఎన్నో హింసాత్మక ఘటనలు జరిగాయి. ప్రధాని మోదీ - తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీల మధ్య మాటల యుద్ధం సాగింది. కేంద్రంలో భాజపా ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా బరిలో దిగిన దీదీకి తీవ్ర నిరాశే ఎదురవుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బంగాల్లో భాజపా బలోపేతం అయిందని స్పష్టం చేశాయి.
ఎగ్జిట్ పోల్స్ | ఎన్డీఏ | తృణమూల్ కాంగ్రెస్ | యూపీఏ |
టైమ్స్ నౌ | 11 | 28 | 2 |
సీ-ఓటర్ | 11 | 29 | 2 |
ఎన్డీ టీవీ | 14 | 26 | 2 |
జన్ కీ బాత్ | 18-26 | 13-21 | 3 |
దిల్లీ
దేశరాజధానిలోనూ మోదీ హవా అధికంగానే ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. దిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీ పార్టీకి తేరుకోలేని దెబ్బతగులుతుందని అంచనా వేశాయి. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేస్తుందని కొన్ని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి.
ఎగ్జిట్ పోల్స్ | ఎన్డీఏ | ఆప్ | యూపీఏ |
టైమ్స్ నౌ | 6 | 0 | 1 |
సీ-ఓటర్ | 7 | 0 | 0 |
ఎన్డీ టీవీ | 6 | 0 | 1 |
జన్ కీ బాత్ | 6-7 | 0-1 | 0 |
ఉత్తర్‌ప్రదేశ్
కేంద్రంలో అధికారం దక్కించుకోవాలంటే... ఉత్తరప్రదేశ్‌లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడం అనివార్యం. 2014లో మోదీ ప్రభంజనంతో భాజపా యూపీలో 80 సీట్లకు గాను 71 కైవసం చేసుకుంది. మరో సీటు మిత్రపక్షానికి వచ్చింది. ఈసారి ఎస్పీ, బీఎస్పీ నేతృత్వంలోని మహాకూటమితో భాజపాకు గట్టి పోటీ తప్పదని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే అత్యధిక మీడియా సంస్థలు మాత్రం భాజపాకే ఎక్కువ స్థానాలు ఖాయమని చెబుతున్నాయి. ఒక్క సీ-ఓటర్ సర్వేలో మాత్రమే భాజపా కన్నా మహాకూటమి కాస్త ఆధిక్యంలో ఉంది.
ఎగ్జిట్ పోల్స్ | ఎన్డీఏ | యూపీఏ | మహాకూటమి |
టైమ్స్ నౌ | 58 | 2 | 20 |
సీ-ఓటర్ | 38 | 2 | 40 |
ఎన్డీ టీవీ | 55 | 2 | 23 |
జన్ కీ బాత్ | 53 | 3 | 24 |
బిహార్
బిహార్‌లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలున్నాయి. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో కలిసి భాజపా బిహార్‌లో బరిలోకి దిగింది. కాంగ్రెస్-ఆర్జేడీ కూటమిగా పోటీకి దిగాయి. అయితే, ప్రజలు భాజపా, జేడీయూ కూటమికే పట్టం కట్టారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ | ఎన్డీఏ | యూపీఏ | ఇతరులు |
టైమ్స్ నౌ | 30 | 10 | 0 |
సీ-ఓటర్ | 33 | 7 | 0 |
ఎన్డీ టీవీ | 32 | 8 | 0 |
జన్ కీ బాత్ | 28-31 | 8-11 | 0 |
ఇదీ చూడండి: WC19: సత్తా చాటేందుకు తురుపు ముక్కలు రెడీ