కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ.. కేరళ అసెంబ్లీ తీర్మానం చేయనుంది. డిసెంబర్ 31న సెషన్‌ను నిర్వహించే అవకాశం ఉంది. సాగు చట్టాలపై దిల్లీలో రైతులు ఉద్యమిస్తున్న వేళ.. వారికి సంఘీభావంగా ఒక రోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ఎల్డీఎఫ్ ప్రభుత్వం నిర్ణయించింది.
తొలుత డిసెంబర్ 23నే ప్రత్యేక సెషన్‌ను నిర్వహించేందుకు ప్రభుత్వం.. గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అనుమతి కోరగా ఆయన తిరస్కరించారు. సమావేశాలకు అంత అత్యవసరం ఏంటని ప్రశ్నించిన ఖాన్.. ప్రభుత్వం వివరణ సరిగా లేదని అన్నారు.
ఇదీ చూడండి: చట్టాల రద్దుకు అసెంబ్లీ సెషన్- గవర్నర్ తిరస్కరణ
అనంతరం.. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గవర్నర్ నిర్ణయం విచారకరమని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు.. రాజ్‌భవన్ ముట్టడికి యత్నించగా జలఫిరంగులు ప్రయోగించి వారిని చెదరగొట్టారు పోలీసులు.
మంత్రులు భేటీ..
అయితే.. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన గవర్నర్.. అసెంబ్లీ సెషన్‌ను నిర్వహించేందుకు సమ్మతించినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర మంత్రులు ఏకే బాలన్, వీకే సునీల్ కుమార్.. గవర్నర్‌ను శుక్రవారం కలిసి తమ ఉద్దేశాన్ని వివరించారు. అనంతరం.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.