కేరళలో వర్షాల కారణంగా మృతి చెందినవారి సంఖ్య 60కి పెరిగింది. భారీ వర్షాలకు కోజికోడ్, అలప్పుజ జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి.
ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం ఉదయం అధికారులతో సమావేశమయ్యారు. వరద పరిస్థితిని సమీక్షించారు. రెండ్రోజుల క్రితం భారీ కొండ చరియలు విరిగిపడి పలువురు సమాధి అయిన మలప్పురం, వయనాడ్ జిల్లాల్లో సహాయక చర్యలపైనా చర్చించారు.
సహాయక చర్యలు ముమ్మరం
సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా 1,318 శిబిరాలు ఏర్పాటు చేశారు. 1.65 లక్షల మందిని తరలించారు. వయనాడ్, కన్నూరు, కసరగడ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటం వల్ల రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
వయనాడ్‌కు రాహుల్!
కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్‌గాంధీ కేరళ వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న బాధితులను కలవనున్నారు.
తెరుచుకున్న విమానాశ్రయం
వరదల కారణంగా శుక్రవారం మూతపడిన కొచ్చి విమానాశ్రయం ఆదివారం మధ్యాహ్నం తెరుచుకుంది. 12.15 గంటలకు అబుదాబీ నుంచి తొలి విమానం రన్‌వేపై దిగింది. పూర్తిస్థాయిలో విమాన సర్వీసులు మొదలుకానున్నాయి.
ఇదీ చూడండి: చైనా: 'లేకిమా' ప్రతాపానికి 30 మంది మృతి