కేరళలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలను గృహ నిర్బంధంలోనే ఉండాలని సూచించారు. నిర్బంధంలో ఉన్న వారి పరిస్థితుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు త్రిస్సూర్ డీఐజీ సురేంద్రన్. వారికి వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
కరోనా బాధితులు, అనుమానితులను నిర్బంధ కేంద్రాలకు తరలిస్తున్నారు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖాధికారులు. మరి కొంత మందిని గృహ నిర్బంధంలోనే ఉంచారు. త్రిస్సూర్ ప్రాంతంలోనే 47 వేల మందికి పైగా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. వారికి అవసరమైన మందులు, ఆహర పదార్థాలను కూడా అధికారులే అందిస్తున్నారు.
మానసిక ఒత్తిడిలోకి..
నిర్బంధంలో ఉన్న కారణంగా వారి కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడే అవకాశం లేదు. దీంతో చాలా మంది మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు గుర్తించారు అధికారులు. ఈ తరుణంలో త్రిస్సూర్ డీఐజీ సురేంద్రన్ సంబంధిత వ్యక్తులతో వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఇలా సంభాషించటం ద్వారా వారిలోని ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో పోలీస్ ఉన్నతాధికారులు గృహ నిర్బంధంలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడతారని డీఐజీ తెలిపారు.
ఇదీ చూడండి:నర్సు పట్ల జమాత్ సభ్యుల అసభ్య ప్రవర్తన