కేరళ మలప్పురం జిల్లాలో పైనాపిల్ బాంబుతో ఏనుగును చంపిన ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా స్పందించాయి. ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైన వేళ.. ఏనుగు మృతిపై విచారణ చేపట్టేందుకు వన్యప్రాణి దర్యాప్తు బృందాన్ని నియమించినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు కోజికోడ్ నుంచి వన్యప్రాణి నేర దర్యాప్తు బృందాన్ని పాలక్కడ్‌కు పంపించినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఘటనపై ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే ప్రారంభమైందని వెల్లడించారు. కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
కేంద్రం సీరియస్
మరోవైపు ఏనుగు మృతి పట్ల కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఏనుగును మరణానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు తెలిపారు.
"కేరళలో ఏనుగు మరణించిన ఉదంతాన్ని పర్యావరణ శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఘటనపై పూర్తి నివేదిక పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం. నేరస్థులపై గట్టి చర్యలు తీసుకుంటాం."
-ప్రకాశ్ జావడేకర్, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి
ఏం జరిగిందంటే?
గర్భంతో ఉన్న ఓ ఏనుగు ఆహారం కోసం కేరళ మల్లప్పురంలోని ఓ గ్రామానికి వచ్చింది. కొందరు స్థానికులు ఏనుగుకు ఒక పైనాపిల్ ఆశచూపారు. ఆ పైనాపిల్‌లో పేలుడు పదార్థాలు పెట్టారు. పైనాపిల్‌ను తిన్న తర్వాత భారీ చప్పుడు పండు పేలిపోయింది.
రక్తమోడుతున్న నోటితోనే ఆ మూగజీవి గ్రామం వదిలి వెళ్లిపోయింది. ఓ పక్క కడుపులో పెరుగుతున్న బిడ్డ.. మరోపక్క నరాలను మెలిపెట్టే బాధ.. దీనికి తోడు గాయంపై ఈగలు వాలుతుండటంతో.. ఏం చేయాలో తెలియక ఆ మూగజీవం వెల్లియార్ నదిలోకి దిగి గొంతు తడుపుకొంది. ఆ నీటి ప్రవాహంతో గాయానికి కొంత ఉపశమనం లభించడం.. ఈగల బాధ తప్పడం వల్ల ఏనుగు అక్కడే ఉండిపోయింది. చివరికి మే 27న సాయంత్రం 4 గంటలకు తుదిశ్వాస విడిచింది.
ఇదీ చదవండి: 'మహా'లో ఆగని కరోనా ఉద్ధృతి-74వేలు దాటిన కేసులు