కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడానికి కేరళ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలుచేస్తోంది. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో వైరస్ తీవ్రత పెరుగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా పూంతూర గ్రామం కరోనా వైరస్‌కు కేంద్రబిందువుగా మారింది. అయినప్పటికీ ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ బయట తిరుగుతుండడం వల్ల ఏకంగా కమాండోలను రంగంలోకి దించింది.
తిరువనంతపురానికి సమీపంలో ఉన్న పూంతూర గ్రామంలో గతకొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. గ్రామంలో చాలా మంది సూపర్ స్ప్రెడర్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఆ ప్రాంతంలో లాక్‌డౌన్ విధించారు. అంతేకాకుండా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను వెతికే పనిలోపడ్డారు. గడిచిన ఐదురోజుల్లోనే 600మందిని గుర్తించి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 119మందికి పాజిటివ్ అని తేలింది. మత్స్యకారులు ఎక్కువగా ఉన్న ఆ గ్రామంలో పాజిటివ్ వచ్చిన ఓ వ్యక్తి 120మందిని కలిసినట్లు గుర్తించారు. ఇలాంటి సూపర్ స్ప్రెడర్లు గ్రామంలో చాలామందే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సాధారణంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఆరుగురికంటే ఎక్కువ మందికి వైరస్ వ్యాపింపజేస్తే అతన్ని సూపర్ స్ప్రెడర్‌గా గుర్తిస్తామని స్థానిక వైద్యాధికారి వెల్లడించారు. ఇలాంటి సూపర్ స్ప్రెడర్ల కారణంగానే గ్రామంలో వైరస్ వ్యాప్తి పెరిగిందన్నారు.
ముందుజాగ్రత్త చర్యగా గ్రామాన్ని మొత్తం మూసివేసిన అధికారులు, అత్యవసరమైతే తప్ప ప్రజలను ఇళ్ల నుంచి బయటకురావద్దని సూచించారు. ఇప్పటికే 25మంది కమాండోలను రంగంలోని దించిన అధికారులు నిబంధనలు ఉల్లంఘించే వారిని ఆసుపత్రులకు తరలిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా, పడవల్లో తమిళనాడుకు మత్స్యకారుల రాకపోకలను నిషేధించారు. కోస్ట్‌గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ, నావికాదళాలు అప్రమత్తంగా ఉండి వీటిని పర్యవేక్షిస్తున్నాయి.
పూంతూర ప్రాంతంలో ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరగిన కారణంగా పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నామని మంత్రి కడకంపల్లి సురేంద్రన్ వెల్లడించారు. దీనిలోభాగంగా అనుమానితులకు ప్రతిఒక్కరికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. పాజిటివ్ వచ్చినవారిని ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందించేందుకు వైద్యసదుపాయాలు ఏర్పాటు చేశామని సురేంద్రన్ తెలియజేశారు.