జమ్ముకశ్మీర్ అంశంపై రోజురోజుకూ ఆందోళన పెరిగిపోతోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. లోయలో అదనపు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు నేతలను అరెస్టు చేశారు. మరికొందరిని గృహనిర్బంధంలో ఉంచారు.
144 సెక్షన్...
ముందస్తు జాగ్రత్త చర్యల్లో జమ్ము శ్రీనగర్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. చరవాణి, అంతర్జాల సేవలను అర్ధరాత్రి నుంచే నిలిపివేశారు.
అంతకుముందు పూంచ్, రాజౌరీ జిల్లాల్లో రాపిడ్ ఆక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) సహా పారామిలిటరీ అదనపు బలగాలను మోహరించారు. జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కశ్మీర్ ఐజీలతో గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆదివారం అర్ధరాత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఇదీ చూడండి:
'కశ్మీర్ ప్రత్యేక హోదా కాపాడేందుకు ఉమ్మడి పోరాటం'
ఇవే భయాలు...
అమర్‌నాథ్‌యాత్రపై ఉగ్రదాడికి కుట్ర జరుగుతోందంటూ ప్రభుత్వ భద్రతాపరమైన హెచ్చరికతో.. కశ్మీర్‌లో ఒక్కసారిగా పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి. అనంతరం.. కేంద్రం 35వేలకుపైగా బలగాలను లోయకు తరలించటంతో రాజకీయ పార్టీలతోపాటు ప్రజల్లో భయాలు మొదలయ్యాయి. కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించే 370, 35-Aను ఎత్తివేసేందుకే కేంద్రం ఇదంతా చేస్తోందని నేతలు ఆరోపించారు. ఈ అంశాన్ని ఇవాళ పార్లమెంటులో లేవనెత్తనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వివరణ కోరనున్నారు.
ఈ నేపథ్యంలో నేడు మోదీ నేతృత్వంలో కేబినెట్ సమావేశం కానుండటం చర్చనీయాంశంగా మారింది.