కశ్మీర్ అంశంపై చర్చించాలన్న పాకిస్థాన్ అభ్యర్థనకు ప్రస్తుతం ఇస్లామిక్ దేశాల ఆర్గనైజేషన్(ఓఐసీ) ప్రధాన కార్యదర్శిగా ఉన్న సౌదీ అరేబియా సమ్మతించినట్లు తెలిసింది. ఈ మేరకు ఇస్లామాబాద్‌లో 2019 డిసెంబర్ 26న జరిగిన సమావేశంలో సౌదీ అరేబియా నిర్ణయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌కు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ సమావేశానంతరం పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. కశ్మీర్ విషయంలో ఓఐసీ పోషించే పాత్ర సహా భారత్ "ఏకపక్షంగా, అన్యాయంగా ఆగస్టు 5(ఆర్టికల్-370 రద్దు చేసిన తేదీ)న తీసుకున్న చర్యల తర్వాత భారత ఆక్రమిత కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులను" చర్చించినట్లు అందులో స్పష్టం చేసింది. దీంతోపాటు పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికలను "భారత్‌లోని మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలే లక్ష్యంగా" తీసుకొచ్చినట్లు పేర్కొంది.
ఐఓసీ సమావేశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే 2020 ఏప్రిల్‌లో ఇస్లామాబాద్‌లో ఈ సదస్సు జరిగే అవకాశం ఉందని పలు మీడియా సంస్థలు చెబుతున్నాయి.
సౌదీ మద్దతుకు కారణం...
కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ భారత్‌పై విషం కక్కడం సహజమే. అయితే సౌదీ అరేబియా పాకిస్థాన్‌ను సమర్థించడం వెనకున్న కారణాలేంటో చూద్దాం.
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని విమర్శనాస్త్రంలా మలుచుకుంది పాకిస్థాన్. భారత్‌పై అసత్య ప్రచారం చేయడానికి, కశ్మీర్‌ను అంతర్జాతీయ వ్యవహారంగా మార్చడానికి ఇది దేవుడిచ్చిన మరో అవకాశంలా భావించింది. "కశ్మీరీల స్వేచ్ఛా పోరాటానికి తమ నుంచి రాజకీయ, నైతిక, దౌత్యపరమైన మద్దతు" ఉంటుందని ఎప్పటికప్పుడు చెబుతూ వస్తోంది.
ఇమ్రాన్ ఆశలన్నీ ఆవిరి
ఆర్టికల్ 370 రద్దు విషయంలో భారత్‌పై వ్యతిరేక గళాన్ని వినిపించడానికి పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఎన్నో ఆశలతో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. భారతదేశం తీసుకుంటున్న చర్యలపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించాలని కోరారు. అయితే తన ప్రయత్నాలన్నీ విఫలమైనట్లు ఇమ్రాన్ స్వయంగా ఒప్పుకోవడం గమనార్హం. భారత్‌పై ఒత్తిడి తేవడానికి అంతర్జాతీయ సమాజం నుంచి సరైన స్పందన రాలేదన్న విషయాన్ని న్యూయార్క్‌లో జరిగిన మీడియా సమావేశంలో అంగీకరించారు. అయితే కశ్మీర్ విషయంలో ఇస్లామిక్ దేశాలైన మలేసియా, టర్కీలు మాత్రం పాకిస్థాన్‌కు వత్తాసు పలికాయి.
భారత్ దౌత్య సంబంధాలను విస్మరించారు
భారత్‌లోని అపార అవకాశాలు, వందకోట్లకు పైగా ప్రజలతో అతి పెద్ద మార్కెట్ ఉన్నందునే ఇతర దేశాలు ఈ విషయంలో జోక్యం చేసుకోవట్లేదని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. అయితే ఈ విషయంలో భారతదేశం అనుసరించిన తెలివైన దౌత్య సంబంధాలను ఇమ్రాన్ విస్మరించారు. ఇటీవల కాలంలో అన్ని దేశాలతో సంబంధాలను భారత్ మెరుగుపర్చుకుంటూ వస్తోంది. ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్(యూఏఈ)లతో సంబంధాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లింది.
ఇందుకే టర్కీ, మలేసియాలు వ్యతిరేకం
మరోవైపు ఇస్లామిక్ దేశాలే అయిన టర్కీ, మలేసియాలు భారత్‌కు వ్యతిరేకంగా గళమెత్తడానికి పాకిస్థాన్‌తో కలిసి ఈ మూడు దేశాల నేతలు జరిపిన చర్చలే ప్రధాన కారణం. టర్కీ, మలేసియా, పాకిస్థాన్ సంయుక్తంగా న్యూయార్క్‌లో జరిపిన చర్చల్లో భాగంగా ఇస్లామిక్ టీవీని స్థాపించాలని నిర్ణయించాయి. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించడానికి ప్రత్యేకంగా ఇస్లామిక్ సదస్సును నిర్వహించేలాని తీర్మానించాయి.
సౌదీకి సవాల్‌గా ఇస్లామిక్ సదస్సు
ఇస్లామిక్ సదస్సుకు ఆతిథ్యమివ్వడానికి మలేసియా ముందుకొచ్చింది. అరబ్ దేశమైన ఖతార్, సహా ముస్లిందేశాలైన పాకిస్థాన్, టర్కీ, మలేసియా, ఇరాన్ ఇందులో పాల్గొనడానికి సముఖత వ్యక్తం చేశాయి. టర్కీ, ఇరాన్, మలేసియా... సౌదీ అరేబియాకు బద్ద శత్రువులన్న విషయం ప్రస్తావించదగినది. యూఏఈ సహా పలుదేశాలు 2017 జూన్ నుంచే ఖతార్‌తో సంబంధాలను తెంచుకున్నాయి. ఈ నేపథ్యంలో కౌలాలంపుర్‌లో ఇస్లామిక్ సదస్సు జరిగింది. ఇది సౌదీ అరేబియాకు ఓ మేలుకొలుపు వంటిది. ఇస్లామిక్ సమాజానికి అధిపతిగా భావించే ఆ దేశానికి ఈ సదస్సు ఓ సవాలు విసిరింది. ఓఐసీకి సమాంతరంగా మరో సంస్థ ఏర్పాటు చేయడం వల్ల సౌదీ నేతృత్వం వహిస్తున్న ఈ సంస్థనే కాకుండా ఇస్లాం సమాజాన్నే బలహీనపరిచే అవకాశముంది.
పౌక్పై సౌదీ ఒత్తిడి
డిసెంబర్లో జరిగిన ఈ సమావేశం జరగకుండా సౌదీ ఆపలేకపోయినా... పాకిస్థాన్ పాల్గొనకుండా ఒత్తిడి తీసుకురావడంలో విజయం సాధించింది. సౌదీ అరేబియా ఒత్తిడికి పాక్ తలొగ్గడానికి కారణాలున్నాయి. ఆ దేశం నుంచి వచ్చే ఆర్థిక సహాయంతో పాటు సౌదీలో పనిచేస్తున్న ఏడు లక్షల మంది పాకిస్థాన్ కార్మికులు... అంతకంతకూ పతనమవుతున్న పాక్ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారారు.
ఆధిపత్యం కోసమే సౌదీ ఆరాటం
ఈ పరిస్థితుల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబించిన సౌదీ... కశ్మీర్లో పరిస్థితులపై చర్చించాలన్న పాక్ సూచనను పరిగణించింది. ఈ విషయంలో కొంత పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వడం సహా ఓఐసీ విశ్వసనీయతకు భంగం కలగకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఇస్లామిక్ ప్రపంచంలో తనకున్న అత్యున్నత స్థానాన్ని పదిలం చేసుకోవడమే సౌదీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇస్లామిక్ దేశాల్లో ఆధిపత్యం కోసం చేస్తున్న ఈ యుద్ధంలో కశ్మీర్ విషయంలో సరైన కారణాలు లభించకపోవడం గమనార్హం.
భారత్-సౌదీల సంబంధాల మాటేంటి?
కశ్మీర్ అంశాన్ని ఓఐసీలో చర్చించడానికి సౌదీ ఒప్పుకున్నందున ప్రస్తుతం భారత్-సౌదీ అరేబియా మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనే విషయం తేలాల్సి ఉంది. అయితే ఈ విషయంలో భారత్ స్పందించే తీరును బట్టే తర్వాత జరిగే పరిణామాలు ఆధారపడి ఉంటాయి. ఓఐసీలో ఇదివరకు కశ్మీర్ విషయంలో చర్చలు చాలా సార్లు జరిగాయి. పలు సమావేశాల్లో కశ్మీర్‌పై ఎన్నో తీర్మానాలు రూపొందించారు. అయితే ఇవన్నీ కశ్మీర్ విషయంలో భారత్ అవలంబించే విధానానికి ఏ మాత్రం భంగం కలిగించలేకపోయాయి. అంతకుమించి కశ్మీర్ అంశంలో అంతర్జాతీయ సమాజ దృష్టికోణాన్ని మార్చలేకపోయాయి.
భారత్ ఏం చేయాలంటే?
ఈ విషయంలో భారత్ తన అసమ్మతిని సౌదీ అరేబియాకు వ్యక్తపరచడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఈ అంశం ఇరుదేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలపై హానికరమైన ప్రభావం పడకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంది. కేవలం ఇస్లామిక్ దేశాల అంతర్గత రాజకీయ విషయంగా పరిగణించాలే తప్ప భారత్‌కు వ్యతిరేకంగా సౌదీ అరేబియా ఎలాంటి ఉద్దేశపూర్వక నిర్ణయాలు తీసుకోలేదన్న విషయాన్ని గ్రహించాలి.
(రచయిత- అచల్ మల్హోత్రా, మాజీ దౌత్యవేత్త)