కర్ణాటకలో గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. 226 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. కరోనా నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
226 తాలూకాల పరిధిలోని 5,728 గ్రామ పంచాయతీలకు రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. 2,22,814 మంది బరిలో నిలిచారు. 8,074 మంది ఏకగ్రీవంగా గెలుపొందారు. డిసెంబర్ 22, 27 తేదీల్లో జరిగిన ఈ ఎన్నికల్లో 78.58 శాతం ఓటింగ్ నమోదైంది. బీదర్ జిల్లా మినహా మిగిలిన చోట బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించింది ఈసీ. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.