కన్నడనాట అనర్హత వేటు పడిన 17 మంది అసమ్మతి ఎమ్మెల్యేలకు సుప్రీంలో చుక్కెదురైంది. అనర్హత వేటుపై అత్యవసర విచారణ చేయాలన్న వీరి వినతిని ధర్మాసనం తిరస్కరించింది. ఇందుతో అంత అత్యవసరం ఏముందని ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది రాకేశ్‌ను ప్రశ్నించింది.
తీర్పు వస్తుంది.. ఇప్పుడే ఎందుకు?
అనర్హత వేటును వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరికొన్ని రోజుల్లో కర్ణాటకలో వీరి స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో వీరి పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాల్సిందిగా ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది రాకేశ్ ద్వివేది సుప్రీంను కోరారు. ఇందుకు సుప్రీం గురువారం నిరాకరించింది. ఇందులో అంత అత్యవసరం ఏమీ కనిపించడం లేదని జస్టిస్ ఎన్‌వీ రమణ స్పష్టం చేశారు. ‘"తీర్పు వస్తుంది. ఇప్పుడు అంత అవసరం ఏంటి’?" అని ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది రాకేశ్‌ను ప్రశ్నించారు.
మరికొద్ది రోజుల్లో ఉపఎన్నికలు
17 మందిపై అనర్హత వేటు పడటంతో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీ అయ్యాయి. వీటికిగానూ ఉప ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఓటర్ల జాబితాను కూడా సిద్ధం చేసి పంపింది. మరి కొద్దిరోజుల్లో ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సుప్రీంలో వీరికి ఊరట లభిస్తే తిరిగి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఉపఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేలోపు తమపై పడిన అనర్హత మచ్చను తుడిచేసుకోవాలని ఆ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన ఈ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. కొద్ది రోజుల పాటు కర్ణాటక రాజకీయం రక్తి కట్టించింది. అయితే, అప్పటి ప్రతిపక్ష భాజపాను బల పరీక్షకు ఆహ్వానించిన సందర్భంగా స్పీకర్ రమేశ్ కుమార్ వీరిపై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించారు.