వ్యూహప్రతివ్యూహాలతో కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారాన్ని నిలుపుకుంటుందా? లేదా భాజపా అధికారాన్ని చేజిక్కించుకుంటుందా? అన్న ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది.
స్పీకర్ కోర్టులో బంతి..
కర్ణాటక... సంకీర్ణ ప్రభుత్వంలోని 14 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామాలు సమర్పించారు. కాగా ఇటీవలే కుమారస్వామి మంత్రివర్గంలో చేరిన స్వతంత్రులు నగేష్, ఆర్.శంకర్లు సోమవారం తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిద్దరూ బహిరంగంగా భాజపాకు మద్దతు ప్రకటించారు. వీరద్దరితో అసమ్మతి నేతల సంఖ్య 16కు చేరింది.
వీరి రాజీనామాలపై స్పీకర్ రమేశ్‌కుమార్ నేడు నిర్ణయం తీసుకోనున్నారు. ముందుగా వీరికి నోటీసులిచ్చి... కీలక అంశాలపై ప్రశ్నించనున్నారు. నేరుగా తనకే ఎందుకు రాజీనామా పత్రాలు సమర్పించలేదని? స్వచ్ఛందంగా ఇచ్చారా? లేదా? అని తెలుసుకోనున్నారు.
విచారణ వాయిదా వేస్తే
అసమ్మతి ఎమ్మెల్యేలు... రాజీనామాలు సరైన పద్ధతిలో ఇవ్వలేదని భావిస్తే స్పీకర్ విచారణను వాయిదా వేసే అవకాశమూ ఉంది. స్పీకర్ విచారణకు గడువు అంటూ ఏమీ ఉండదు. విచారణను వాయిదా వేసినా, స్పీకర్‌పై న్యాయస్థానంలో సవాలు చేసే వీలులేదు.
అందువల్ల.... విచారణలో స్పీకర్ జాప్యం చేస్తే ఆయనపై ప్రతిపక్ష భాజపా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
చట్టపరమైన అంశాలు
అసమ్మతి ఎమ్మెల్యేలు బుజ్జగింపులకు లొంగకపోతే ప్రజాప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 164-1బి ని ప్రయోగించాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనిని అనుసరించి పార్టీ ఫిరాయింపులకు ప్రయత్నించిన శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌కు విన్నవించనుంది.
మంగళవారం సీఎల్పీ సమావేశానికి హాజరుకావాలని నోటీసులు పంపడం, విప్ జారీ తదితర అస్త్రాలను సంధించాలని కాంగ్రెస్ అధిష్ఠానం చూస్తోంది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయనిపుణులతోనూ చర్చిస్తోంది. స్పీకర్ రమేశ్‌కుమార్ నిర్ణయంపైనే ప్రభుత్వ భవిత ఆధారపడి ఉంది.
రాజీనామాలను ఆమోదిస్తే..
అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే... భాజపా అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎలాగంటే...
కర్ణాటకలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 224. ప్రస్తుతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినవారు 14 మంది. అంటే సభలో మిగిలిన సభ్యుల సంఖ్య...స్పీకర్‌తో కలిపి 210. కనుక ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావల్సిన మేజిక్ నెంబర్ 106.
పార్టీల బలాబలాలు...
భాజపాకు సొంతంగా 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తాజాగా మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు స్వతంత్రులు నగేష్, శంకర్ భాజపాకు మద్దతు ప్రకటించారు. అందువల్ల భాజపా బలం 107కు చేరుకుంది.
స్పీకర్‌ను విడిచిపెడితే ... కూటమికి కాంగ్రెస్ 67, జేడీఎస్ 34, బీఎస్పీ 1 కలుపుకొని మొత్తం 102 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.
అందువల్ల స్పీకర్ రాజీనామాలు ఆమోదిస్తే సంకీర్ణం కుప్పకూలడం ఖాయం.
ఇదీ చూడండి: పగ్గాలు: అనుభవానికా.. ఉరకలేసే యువతరానికా?