కర్ణాటకలో కొన్ని రోజులగా కురుస్తోన్న కుండపోత వర్షాలు కాస్త తగ్గాయి. అయితే వరదలు మాత్రం కొనసాగుతున్నాయి. చాలాచోట్ల వాగులు, వంకలు ఇంకా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప సహాయ, పునరుద్ధరణ చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు వరదల వల్ల 24 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షలు పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. పునరుద్ధరణ పనుల కోసం తక్షణమే రూ.100 కోట్లు విడుదల చేసింది.
బెళగావి- బాఘల్‌గోట్ జాతీయ రహదారిపై వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. కల్వర్టు పైనుంచి వరదనీరు ప్రవహిస్తోంది. బాఘల్‌కోట్, విజయపుర, రాయ్‌చూర్, గదగ్, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, చిక్కమంగళూరు, కొడగు జిల్లాలు వరద ప్రభావంతో తీవ్రంగా నష్టపోయాయి.
ఉగ్రరూపం...
రాష్ట్రంలో నదులు ఉగ్రరూపం దాల్చాయి. తుంగభద్ర నది నీరు రోడ్లపైకి చేరింది. నేత్రావతి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.
ఎటుచూసినా నీరే...
జనావాసాల్లో మోకాళ్ల పైవరకు వరద నీరు నిలిచి ఉంది. సహాయ బృందాలు లైఫ్‌బోట్ల ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.
- ఇదీ చూడండి: వరదలకు కేరళ విలవిల- 43కు చేరిన మృతులు