కర్ణాటక రాజకీయ సంక్షోభం సెగ పార్లమెంటును తాకింది. కాంగ్రెస్ సభ్యులు ఉభయ సభల్లో నిరసనలను కొనసాగించారు. భాజపాపై లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి తీవ్రంగా విరుచుకుపడ్డారు.
కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందని అధీర్ ఆరోపించారు. కొనుగోలు రాజకీయాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ పార్టీ సభ్యులతో కలిసి వాకౌట్ చేశారు.
"రాజ్‌భవన్ నుంచి రాగానే కారు సిద్ధంగా ఉంటుంది. అక్కడినుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లగానే విమానం సిద్ధంగా ఉంటుంది. హోటల్ రెడీగా ఉంటుంది. వాళ్ల (భాజపా) నేతలు ఇప్పుడు కర్ణాటక తీసుకుంటున్నాం... భవిష్యత్తులో మధ్యప్రదేశ్‌ను కూడా లాక్కుంటామంటున్నారు. ఈ కొనుగోలు రాజకీయాలకు స్వస్తి పలకాలి."
-అధీర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ పక్షనేత
రాహుల్ నినాదాలు...
ఓ వైపు అధీర్ రంజన్ ఆవేశపూరితంగా ప్రసంగం చేస్తుంటే మరో వైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నినాదాలు చేశారు. మొదటి సారిగా పార్లమెంటులో ఈ విధమైన నిరసన చేపట్టారు రాహుల్.
'నియంతపాలన అంతమవ్వాలి, కొనుగోలు రాజకీయాలకు స్వస్తి పలకాలి' అంటూ మొదట సభ్యులు నినదించారు. రాహుల్ వారిని అనుసరించారు.
రాజ్యసభలోనూ వాయిదాల పర్వం
కర్ణాటక సంక్షోభంపై కాంగ్రెస్ సభ్యుల నిరసనలతో ఎగువ సభలో గందరగోళం నెలకొంది. మూడు సార్లు సభ వాయిదా పడింది. సభలో రోజంతా ఎటువంటి చర్చా జరగలేదు. ఉదయం సభ ప్రారంభం అయినప్పటి నుంచి వెల్‌లోకి దూసుకెళ్లిన సభ్యులు నినాదాలు చేస్తూనే ఉన్నారు.
కాంగ్రెస్‌తో పాటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తృణమూల్ ఎంపీలు వెల్‌లోకి వచ్చారు. ఫలితంగా మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సారి వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్యనాయుడు. అనంతరం సభ ప్రారంభమయ్యాక ప్రశ్నోత్తరాలను మొదలుపెట్టారు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్. అయినా పరిస్థితిలో మార్పు రాకపోగా... 2 గంటల వరకు వాయిదా పడింది.
మూడోసారీ పరిస్థితి మారలేదు. సభను బుధవారానికి వాయిదా వేశారు.
ఇదీ చూడండి:- 'కర్ణాటకీయం'కు ముగింపు దొరికేనా...?