కర్ణాటక రాజకీయం రకరకాల మలుపులు తిరుగుతోంది. విధానసభలో విశ్వాస పరీక్ష సందర్భంగా గురువారం చర్చ మొదలైంది. ఎటూ తేలకుండానే సభ వాయిదా పడింది. గందరగోళం నడుమ సభను శుక్రవారం ఉదయం 11గంటలకు వాయిదా వేశారు స్పీకర్. మరోవైపు బలపరీక్ష ఈరోజే నిర్వహించి తీరాలని పట్టుబట్టిన భాజపా నేత యడ్యూరప్ప.. తమ సభ్యులు సభను వీడకుండా రాత్రంతా ఇక్కడే ధర్నా నిర్వహిస్తారని ప్రకటించారు.
కర్ణాటక రాజకీయ పరిణామాలు గురువారం చకచకా మారాయి. భోజన విరామ సమయం తర్వాత సభ సమావేశం కాగా.. తమ పార్టీ ఎమ్మెల్యేలను అపహరించారని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఆరోపించారు. ఆరోగ్య సమస్యలతో ముంబయిలోని ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ ఫొటోలను సభలో ప్రదర్శించారు. తమ ఎమ్మెల్యేలు ఎక్కడని ప్రశ్నించారు శివకుమార్. వారి కుటుంబ సభ్యుల నుంచి ఫోన్లు వస్తున్నట్లు చెప్పిన ఆయన... ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
భాజపా ఆందోళన
ఈ సందర్భంగా భాజపా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విశ్వాస పరీక్షపై ఓటింగ్‌ను జాప్యం చేసేందుకు కాంగ్రెస్-జేడీఎస్ ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు.
అరగంట వాయిదా
శాసనసభ్యుడు శ్రీమంత్ పాటిల్ పంపినట్లు వచ్చిన లేఖపై తేదీ లేదని, లెటర్ హెడ్ కూడా లేదన్నారు స్పీకర్ రమేశ్ కుమార్. పాటిల్ లేఖపై తనకు అనుమానాలున్నాయన్నారు. ఈ అంశంపై అడ్వకేట్ జనరల్‌తో మాట్లాడేందుకు సభను అరగంట వాయిదా వేశారు.
గవర్నర్‌తో భాజపా నేతల భేటీ..
సభా వాయిదా వేసిన వెంటనే.. ఇవాళే విశ్వాస పరీక్ష ఓటింగ్ జరిపేలా స్పీకర్‌ను ఆదేశించాలని భాజపా నేతల బృందం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కోరింది. అనంతరం రాజ్‌భవన్ ప్రత్యేక అధికారి అసెంబ్లీకి వచ్చారు. సభ మళ్లీ సమావేశమైంది.
సభా కార్యక్రమాలను గమనించనున్న రాజ్‌భవన్ ప్రత్యేక అధికారి ఇచ్చే నివేదికను గవర్నర్.. కేంద్ర హోంశాఖకు పంపనున్నారు.
ఈ రోజే బలపరీక్ష నిర్వహించాలని లేఖ
స్పీకర్‌కు ప్రత్యేక సందేశం పంపారు గవర్నర్. విశ్వాస తీర్మానంపై నేడే ఓటింగ్ చేపట్టే అంశాన్ని పరిశీలించాలని కోరారు. గవర్నర్ సందేశాన్ని స్పీకర్ చదివి వినిపించారు.
అర్ధరాత్రయినా సరే..
ఎవరు మాట్లాడినా అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు యడ్యూరప్ప. అర్ధరాత్రి అయినా సరే సభ నిర్వహించాలన్నారు. చివరలో ఓటింగ్ జరపాలని స్పష్టం చేశారు.
భాజపా డిమాండును పెద్దగా పరిగణించకుండా చివరకు సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్. నిరసనగా భాజపా సభ్యులు రాత్రంతా సభలోనే ధర్నా నిర్వహిస్తారని యడ్యూరప్ప ప్రకటించారు.