లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత శాసనసభ్యుల ఫిరాయింపు వార్తలతో కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ మనుగడపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది.
ఈ నెల 12న మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు. గవర్నర్ వజూబాయ్ వాలాతో సమావేశం అనంతరం ఆయన ట్విట్టర్‌లో ఈ విషయాన్నివెల్లడించారు.
ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న 34 మంత్రి పదవుల్లో కాంగ్రెస్ 22, జేడీఎస్ 12 స్థానాలను పంచుకున్నాయి. మిగిలిన 3 ఖాళీల్లో ఎవరిని నియమించాలన్నదే రెండు పార్టీలకు సవాల్‌గా మారింది.
కుమారస్వామి, కాంగ్రెస్ నేతల మధ్య సుదీర్ఘ మంతనాల అనంతరం ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం తీసుకున్నారు. పలువురు పాత మంత్రులను తొలగించడం సహా అసంతృప్తి గళం వినిపిస్తోన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పదవులు కట్టబెట్టే అవకాశం ఉంది.
అసంతృప్తి పెరగక తప్పదు
ప్రభుత్వాన్ని నడపలేమని జేడీఎస్-కాంగ్రెస్ భావిస్తే ఆ అవకాశాన్ని తమకివ్వాలంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బి. ఎస్. యడ్యూరప్ప సవాల్ విసిరారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఇరుపక్షాల్లో అసంతృప్తి తారస్థాయికి చేరుతుందని జోస్యం చెప్పారు.