కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడం వల్ల దేశంలోని అన్ని ఆలయాలు, ప్రార్థనా మందిరాలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి తమ రాష్ట్రంలో ఆలయాలను తెరవాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్ కొనసాగనున్న వేళ జూన్ 1 నుంచి ఆలయాలు తెరుస్తామని ప్రకటించిన తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఆలయాల్లో అనుసరించాల్సిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనుంది. కానీ పండుగలు, జాతరలకు మాత్రం ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అలాగే, పాఠశాలలను కూడా జులై 1 నుంచి తెరిచే యోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే, పాఠశాలల పునఃప్రారంభంపై మాత్రం ఇంకా తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.
మరోవైపు, కర్ణాటకలో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 101 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2283 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 748 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1489 పాజిటివ్ కేసులు ఉన్నాయి.
ఇదీ చూడండి: క్వారంటైన్ ఛార్జీలు సగం వాపస్