కర్ణాటక రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కీలక మలుపులు తిరుగుతున్నాయి. విశ్వాస పరీక్ష కోసం మరికొన్ని రోజులు వేచిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. శుక్రవారం ఓ కొలిక్కివస్తుందనుకున్న రాజకీయ సంక్షోభం అలాగే సాగనుంది.
విశ్వాస పరీక్షకు సంబంధించి ఓటింగ్ జరగకుండానే సభను సోమవారానికి(జులై 22) వాయిదా వేశారు స్పీకర్ రమేశ్ కుమార్. శాసనసభలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ రెండుసార్లు గడువు పెట్టినప్పటికీ ముఖ్యమంత్రి కుమారస్వామి, సభాపతి రమేశ్ కుమార్ పెద్దగా పట్టించుకోలేదు.
సుప్రీంను ఆశ్రయించిన సీఎం, గుండూరావు..
విశ్వాస తీర్మానంపై చర్చ సాగుతుండగా.. సీఎం, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు విప్ విషయంలో స్పష్టత కోరుతూ వేర్వేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
పార్టీ విప్ విషయంలో ఈ నెల 17న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో అస్పష్టత నెలకొందని, దీనిపై పునఃసమీక్షించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. గవర్నర్ జోక్యాన్నీ ప్రస్తావించారు. ఫలితంగా.. ఈ కన్నడ రాజకీయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అందరికీ అవకాశం..
విశ్వాస పరీక్షపై ప్రతి ఒక్కరూ మాట్లాడేలా అవకాశం కల్పిస్తున్నారు స్పీకర్. ఫలితంగా.. ఈ వ్యవహారం ముగిసేసరికి రెండు, మూడు రోజులు పట్టేలా ఉంది. అదే అదనుగా.. సభను వాయిదా వేయాలని కోరారు కూటమి నేతలు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళే బలపరీక్ష చేపట్టాలని భాజపా నినాదాలు చేసింది. ఆందోళనల నడుమ సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్.