కెప్టెన్ విజయంత్ థాపర్. కార్గిల్ యుద్ధంలో శత్రువు చేతికిచిక్కిన స్థావరాలని భారత సైన్యం తిరిగి చేజిక్కించుకోవటంలో కీలకపాత్ర తనది. ఆ క్రమంలోనే అసువులు బాసిన థాపర్‌కు దేశం మొత్తం అశ్రునివాళులు అర్పించింది. తల్లిదండ్రులకి చివరిగా తను రాసిన లేఖ, తిరిగి రాలేనని తెలిసినా.. తెగించి శత్రుమూకలపై దాడిచేస్తూ ముందుకురికిన తెగువ... దేశం గుండెల్లో స్ఫూర్తి రగిలిస్తోంది. ఆయన వీరగాథ ఎప్పటికీ కార్గిల్ కొండల్లో మార్మోగుతూనే ఉంటుంది.
యుద్ధ ట్యాంకరే
మాజీ సైనికాధికారి వీఎన్ థాపర్ కుమారుడే విజయంత్. తండ్రే కాదు.. తాత, ముత్తాత అంతా సైనికాధికారులే. కొడుక్కి విజయంత్ అని ఓ యుద్ధ ట్యాంకర్ పేరు పెట్టుకున్నాడు వీఎన్ థాపర్. విజయంత్ శత్రువు గుండెల్లో యుద్ధట్యాంకరే అయ్యారు. ఉహ తెలియక ముందే తుపాకులు.. ట్యాంకర్ల మధ్యకు చేరుకున్న విజయంత్.. సైనిక వాతావరణంలో పెరిగినా మనసు మాత్రం వెన్న.
ఏడేళ్లకే తుపాకీ పేల్చిన ఘనుడు
చిన్నప్పట్నుంచి విజయంత్‌కు సైన్యంలో చేరాలనే ఆలోచన.. తాత ముత్తాతల్లా దేశ సేవలో తరించాలనే తపన. సైనికాధికారి కావడం కోసం కసరత్తులు చేసేవారు. ఏడేళ్ల వయస్సులోనే విజయంత్ తుపాకి పేల్చాడని.. తండ్రి కల్నల్ వీఎన్ థాఫర్ గర్వంగా చెబుతారు.
లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం కఠోర కృషి చేసిన విజయంత్ మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. 1998 డిసెంబర్ 12న శిక్షణ పూర్తి చేసుకున్న విజయంత్.. రాజ్‌పుతానా రైఫిల్స్‌లో సైన్నికాధికారిగా విధుల్లో చేరి... తర్వాత తన ప్రస్థానాన్ని దేశమంతా చాటాడు.
ఉగ్రబాధితుల బాధ్యత
ఒకసారి... ఉగ్రవాదులను ఏరివేసేందుకు కశ్మీర్ కుప్వారాకు వెళ్లిన విజయంత్‌ను... అక్కడ రుక్సానా అనే ఓ చిన్నారి బాగా ఆకర్షించింది. స్తబ్దుగా ఉన్న అమ్మాయి గురించి పాఠశాల ఉపాధ్యా యులను వాకబు చేస్తే... మొదట్లో అందరిలానే ఉండేదని.. కళ్ల ముందే ఉగ్రవాదులు ఆమె తండ్రిని కాల్చి చంపారని.. ఆ షాక్‌తో మాట పోయిందని తెలిపారు. చలించిపోయిన విజయంత్ అప్పటి నుంచి ఆ కుటుంబ బాధ్యత తీసుకున్నారు. రుక్సానాను అక్కున చేర్చుకున్నారు.
'నన్ను చంపే బుల్లెట్ తయారు కాలేదమ్మా'
ఇంతలోనే కార్గిల్ యుద్ధం వచ్చింది. విజయంత్ బృందానికి టోటోలింగ్ సహా మరో 2 పర్వతాలు విడిపించే బాధ్యత అప్పగించారు. మొత్తం యుద్ధంలో ఇవి కీలకమైనవి, క్లిష్టమైనవి. టోటోలింగ్‌ను విజయవంతంగా కైవసం చేసుకుని శిఖరంపై త్రివర్ణ పతాకం ఎగురవేశారు. ఆ సమయంలో తల్లి త్రిపాఠ థాపర్‌తో ఫోన్‌లో తన ఆనందం పంచుకున్న విజయంత్ 32బుల్లెట్లను చాకచక్యంగా తప్పించుకున్నానని గర్వంగా చెప్పాడు. తల్లి ఆందోళన చెందితే.. అమ్మా.. నన్ను చంపే బుల్లెట్ ఇంకా తయారు కాలేదు. భయపడకు అని భరోసా ఇచ్చాడు.
చివరి లేఖ
కెప్టెన్ విజయంత్ థాపర్ బృందం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో యుద్ధం చేసింది. పాక్ సేనలను ఓడించి తీరుతామన్న ధీమాతోనే ఉన్నా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో కూడా ఉహించారు. మరోజన్మ ఉంటే మళ్లీ సైన్యంలో చేరుతానని.. చేరదీసిన చిన్నారి రుక్సానాకు ప్రతినెల డబ్బు పంపించాలని.. తన ఆఖరి లేఖలో తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. గ్రెనేడ్ దాడిలో 2009 జూన్ 29న 22ఏళ్ల వయస్సులోనే వీర మరణం పొందాడు కెప్టెన్ విజయంత్.
వీర చక్ర
విజయంత్ థాపర్ శౌర్యపరాక్రమాలు గుర్తించిన ప్రభుత్వం 'వీర చక్ర' ప్రకటించింది. కార్గిల్‌లోని యుద్ధ స్మారకంలో ఉన్న హెలిప్యాడ్‌కు సైతం కెప్టెన్ విజయంత్ పేరు పెట్టారు. విజయంత్ అమరుడైన ప్రాంతానికి ఆయన కుటుంబం ప్రతి సంవత్సరం వెళ్లి నివాళి అర్పిస్తోంది. రుక్సానా బాధ్యతను వీఎన్ థాఫర్ చూసుకుంటున్నారు. కెప్టెన్ విజయంత్పై అతడి తండ్రి.."విజయంత్ ఎట్ కార్గిల్, ది బయోగ్రఫీ ఆఫ్ ఏ వార్ హీరో" పేరుతో గత సంవత్సరం పుస్తకం రాశారు.