ప్రేమ పేరుతో ఆడవారు మోసపోతున్న ఘటనలు రోజూ ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. తమిళనాడులో... ప్రేమిస్తూన్నాంటూ యువతులను నమ్మించి వంచించిన ఓ ప్రబుద్ధుడిని ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 100మందికి పైగా మహిళల జీవితాలతో అతడు ఆడుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే..
కన్యాకుమారి నాగర్ కొయిల్ నగరానికి చెందిన 26ఏళ్ల కాశి అలియాస్ సుజీ అనే యువకుడు.. అమ్మాయిలకు ప్రేమను ఎరగా వేసి మోసాలకు పాల్పడుతుంటాడు. సామాజిక మాధ్యమాల ద్వారా మరో నలుగురు అబ్బాయిల సాయంతో.. యువతులకు వల వేస్తాడు. ముఖ్యంగా వైద్య విద్యార్థినులే లక్ష్యంగా చేసుకొని ఈ దారుణాలకు పాల్పడుతుంటాడు కాశి.
రోజుకో వేషం..
ఇతని వేషాలు అంతా ఇంతా కాదు. వ్యాపారవేత్త, ట్రైనీ పైలట్, న్యాయవాది.. ఇలా రకరకాలుగా నటిస్తూ.. అమ్మాయిలను బుట్టలో వేసుకుంటాడు. అలా యువతులను తన వశపరుచుకొని.. వారితో సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫొటోలను వారికి తెలియకుండానే చిత్రీకరిస్తాడు. అనంతరం డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతుంటాడు.
ఇలా ఇతడి చేతిలో మోసపోయిన చెన్నైకి చెందిన వైద్య విద్యార్థిని.. పోలీసులకు ఆన్లైన్ ఫిర్యాదు చేసింది. వెంటనే కాశిని అరెస్టు చేసి.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే తాను మాత్రం ఏ అమ్మాయినీ మోసం చేయలేదని, కేవలం వారి కోరికలను తీర్చానని సమర్థించున్నాడు ఈ ప్రబుద్ధుడు.