ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. తమ కుమార్తెను లైంగికంగా వేధిస్తున్నాడని కేసు పెట్టినందుకు ఆమె తల్లిపై ప్రతీకారం తీర్చుకున్నాడో వ్యక్తి. తన స్నేహితులతో కలిసి అతి దారుణంగా బాలిక తల్లిని కొట్టిచంపాడు.
కాన్పూర్‌లోని చకేరీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ 13ఏళ్ల బాలికపై స్థానికంగా ఉండే మఫూజ్ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయమై బాలిక తల్లి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మఫూజ్ సహా మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇటీవల బెయిల్‌పై వచ్చిన నిందితులు బాలిక కుటుంబంపై కక్ష పెంచుకున్నారు.
ఈ నెల 9న మద్యం మత్తులో ఉన్న నిందితులు బాలిక ఇంటికి వెళ్లి ఆమె తల్లి, పిన్నిపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక తల్లి వారం పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. గాయపడిన బాలిక చిన్నమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. తమపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని నిందితులు పలుమార్లు బెదిరించారని బాలిక కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:పుట్టినూరే తెలియదు...ఇక తల్లిదండ్రులదా?