ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు, ఎనిమిది మంది పోలీసుల మృతికి కారకుడైన వికాస్ దూబే కోసం వేట ముమ్మరంగా సాగుతోంది. తాజాగా దాడిలో పాల్గొన్న మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు.
ఈ కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం అరెస్టయిన వారిలో దూబే దగ్గరి బంధువు శర్మ, స్నేహితుడు సురేశ్ వర్మ, పనిమనిషి రేఖ ఉన్నారు. దూబే గ్యాంగ్‌లో కీలక సభ్యుడు, రేఖ భర్త దయా శంకర్ అగ్నిహోత్రిని గత ఆదివారమే అరెస్ట్ చేశారు. అతనిపై రూ.25వేల రివార్డు ఉంది. ఇంకా 17 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
" చౌబేపుర్ పోలీస్ స్టేషన్‌కు 10 మంది కానిస్టేబుళ్లను పంపాం. ఇది సస్పెండ్ అయిన వారి స్థానాన్ని భర్తీ చేస్తుంది. దూబే ఫొటోలు అన్ని టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేశాం. అతనిపై ఉన్న రివార్డును రూ. 2.5 లక్షలకు పెంచాం. దూబే నేపాల్‌కు పారిపోకుండా సరిహద్దు ప్రాంతాలైన లఖింపుర్ ఖేరి, మహరాజ్ గంజ్, సిద్ధార్థ్ నగర్, భహ్రాచ్, గోరఖ్‌పుర్‌లలో నిఘా పెంచాం. దూబే మధ్యప్రదేశ్‌లోని చంబల్ లోయల్లో దాక్కొని ఉండొచ్చని భావిస్తున్నాం."
- దినేశ్ కుమార్, కాన్పుర్ ఎస్ఎస్పీ.
వీడియో వైరల్..
ఓ వైపు దూబే కోసం గాలింపు కొనసాగుతున్న వేళ అతనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భాజపా ఎమ్మెల్యేలు సహా పలువురి రాజకీయ నేతలతో తనకు సంబంధాలు ఉన్నట్లు దూబే పేర్కొనడం అందులో ఉంది. 2017లో క్రిష్ణనగర్‌లో ఎస్టీఎఫ్ పోలీసులు దూబేను అరెస్ట్ చేసి విచారిస్తున్న సమయంలో వీడియో తీసినట్లుగా తెలుస్తోంది.
అవాస్తవం..
సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోన్న వీడియోలో చెప్పినవన్నీ అవాస్తవమని, దూబేతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని తోసిపుచ్చారు భాజపా నేతలు. తన నియోజకవర్గంలో సాయం కోసం ఎంతో మంది వస్తుంటారని, పలు సందర్భాల్లో దూబేపై చర్యలు తీసుకునేందుకు తాను బాధితులకు మద్దతుగా నిలిచానని గుర్తు చేశారు ఓ ఎమ్మెల్యే. తన పేరును చెడగొట్టాలనే కొందరు తన ఫొటోలను ఉపయోగించారని పేర్కొన్నారు.