ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో దారుణం జరిగింది. రౌడీషీటర్ వికాస్ దూబేను పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో... దుండగుడి అనుచరులు పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎనిమిది మంది పోలీసులు అమరులవ్వగా, ఏడుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మృతుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా, ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. గాయపడిన వారిలో ఎస్ఓ బీతూర్ సహా ఏడుగురు పోలీసు సిబ్బంది ఉన్నారు.
"రౌడీషీటర్ వికాస్ దూబేను పట్టుకునేందుకు చౌబేపుర్ పోలీసుస్టేషన్ పరిధిలోని విక్రూ గ్రామానికి పోలీసులు వెళ్లారు. అయితే దుండగులు తాము తలదాచుకున్న ఇంటిపై నుంచి కాల్పులకు తెగబడ్డారు. ఈ దారుణ ఘటనలో 8 మంది పోలీసులు అమరులయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు."
- పోలీసులు
వికాస్ దూబేపై 60 వరకు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని... వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.
మృతుల కుటుంబాలకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చూడండి: కరోనా బాధితులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం