తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది. తాజాగా డీఎంకే నేత, తూత్తుకుడి లోక్‌సభ అభ్యర్థి కనిమొళి నివాసంలో ఎన్నికల సంఘం, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తమకు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపారు. అయితే దాడులకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
కనిమొళికి మద్దతుగా ఆమె ఇంటివద్ద పెద్దసంఖ్యలో డీఎంకే కార్యకర్తలు గుమిగూడారు.
తూత్తుకుడిలో కనిమొళిపై భాజపా తమిళనాడు అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ పోటీ చేస్తున్నారు.
స్టాలిన్ స్పందన
కనిమొళి ఇంట్లో సోదాలు చేయడంపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ స్పందించారు. ఓటమి భయంతోనే భాజపా దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సంఘం స్వతంత్రతను మోదీ హరించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెల్లూర్ కేసులో అన్నీ రూ. 2 వందల నోట్లే
మరోవైపు వెల్లూర్‌లో సంచలనం సృష్టించిన రూ.11.53కోట్ల వ్యవహారంలో కీలక ప్రకటన చేశారు అధికారులు. లోక్‌సభ డీఎంకే అభ్యర్థి కతిరి ఆనంద్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సొమ్ములో 90 శాతం వరకు రూ.200 నోట్లే ఉన్నట్లు తెలిపారు.
ఓటర్లను ప్రలోభపెట్టేందుకే ఇంత భారీ మొత్తంలో నగదును దాచారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెల్లూరులో ఎన్నికలను నిలిపివేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈసీ ప్రతిపాదనలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు.
త్రిపురలో ఎన్నికలు వాయిదా
త్రిపుర లోక్‌సభ స్థానం పోలింగ్ తేదీని ఈసీ మార్పు చేసింది. ఈ నెల 18న ఎన్నికలు జరగాల్సి ఉన్నా... శాంతి భద్రతల కారణంగా వాయిదా వేసింది. సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న సమాచారంతో ఈ నెల 23న నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది.
రాష్ట్ర ఎన్నికల అధికారి సహా పోలీస్ పరిశీలకుడు రాష్ట్రంలోని పరిస్థితుల విషయమై ఎన్నికల సంఘానికి నివేదించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు మరింత భద్రత కల్పించాలని కోరారు.