దేశంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, హింసాత్మక ఘటనలను అరికట్టాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి. దేశంలో అసలు ఆడబిడ్డలకు ఏం జరుగుతుందని ప్రశ్నించిన కైలాశ్.. ఇది జాతికే అవమానకరమని అభిప్రాయపడ్డారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్ ఘటనపై స్పందిస్తూ.. ప్రధాని మోదీ అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరు ప్రారంభించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం తనతో సహా.. యావత్ భారతదేశం మోదీకి మద్దతిస్తుందని తెలిపారు.
2017లో అత్యాచారాలు లేని సురక్షిత దేశం కావాలని.. దేశవ్యాప్తంగా 11వేల కిలోమీటర్ల యాత్ర చేపట్టినట్లు వివరించారు కైలాశ్. ఇందులో లక్షలాది మంది.. మహిళలకు న్యాయం జరగాలని కోరినట్లు తెలిపారు.
అప్పటినుంచి ప్రభుత్వం ఇలాంటి ఘటనలపై వేగంగా స్పందిస్తూ.. కఠిన చర్యలు చేపడుతోందని చెప్పారు. సర్వోన్నత న్యాయస్థానం కూడా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేయాలని ఆదేశాలిచ్చినట్లు గుర్తుచేశారు.
ఇదీ చదవండి: 'హాథ్రస్ వ్యవహారాన్ని డబ్బుతో సెటిల్ చేసేశాం కదా!'