ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. గురు, శని గ్రహాల కలయిక జరిగింది. భూమి మీద నుంచి చూస్తే.. రెండు అతిపెద్ద గ్రహాలు ఒకే నక్షత్రంలో కనువిందు చేశాయి. దాదాపు 4 శతాబ్దాల తర్వాత చోటుచేసుకుంది ఈ అద్భుత ఘట్టం.
దేశంలో దాదాపు 2 గంటల పాటు ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశం ఉంది. పరిభ్రమణంలో 20 ఏళ్లకోసారి మాత్రమే కాస్త దగ్గరగా వచ్చే గురు, శని గ్రహాలు.. భూమి నుంచి చూస్తే 0.1 డిగ్రీలు ఎడంగా కనిపిస్తాయి. ఈ రెండు గ్రహాలు చివరి సారిగా 1623లో అతి దగ్గరగా వచ్చాయి.
ఇలాంటి సంయోగం రాత్రివేళ జరగడం 800 ఏళ్లలో ఇదే మొదటిసారి. మళ్లీ 2080 మార్చి 15న రెండు గ్రహాలు ఈ స్థాయిలో చేరువగా రానున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
టెలిస్కోప్ల ద్వారా 'మహా సంయోగం' వీక్షణం..
గురు, శని గ్రహాల మహో సంయోగ అద్భుతాన్ని వీక్షించేందుకు దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో దిల్లీలోని నెహ్రూ ప్లానటోరియం వద్దకు తరలివచ్చారు ప్రజలు. టెలిస్కోప్ల సాయంతో ఈ అద్భుతాన్ని తిలకించారు. మరింత మందికి ఈ కనువిందును అందించేందుకు పెద్ద పెద్ద స్క్రీన్ల వంటివి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.