ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత జిల్లా కాంకేర్‌లోని అంబేడాలో ధనురామ్ దుగ్గా (80), నతల్దేయి దుగ్గా (70) దంపతులు నివసిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వారి ఇంటి నిర్మాణం కోసం బ్యాంకులో రూ.20 వేలు రుణం తీసుకున్నారు. కిందా మీదా పడి మొత్తానికి రూ.14 వేలు కట్టారు. ఇంకా రూ.6 వేలు బాకీ ఉందని బ్యాంకు నోటీసులు జారీ చేసింది.
ఈ విషయం చివరకు లోక్ అదాలత్‌కు చేరింది. జూలై 13న విచారణకు హాజరయ్యారు దుగ్గా దంపతులు. వారి గోడును కోర్టులో విన్నవించుకున్నారు. పనిచేద్దామన్నా చేసే సత్తువ లేదని.. సాయం చేయడానికి పిల్లలు లేరని చెప్పారు. నెలనెలా వచ్చే 35 కిలోల రేషన్ బియ్యం, పింఛను డబ్బులే శరణ్యమని తెలిపారు.
"డబ్బులు కట్టలేదని బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయి. బ్యాంకు వాళ్లు కోర్టుకు వెళ్లండి అక్కడ చెప్పుకోండి అన్నారు. మొదటిసారి కోర్టుకు వచ్చాం. ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. రుణం మాఫీ చేయాలని కోరాం."
- నతల్ దేయి దుగ్గా, బాధితురాలు
కదిలించిన మనసు...
ఈ మాటలు విన్న జడ్జి హేమంత్ సరఫ్ మనసు చలించిపోయింది. బ్యాంకు వారిని ఆ డబ్బు తగ్గించే వీలుందా అని అడగగా.. వారు మొత్తంలో రూ.3 వేలు చెల్లించగలమని చెప్పారు. తమ వద్ద ఆ కాస్త డబ్బు కూడా లేదని ఆ దంపతులు వాపోయారు. చివరికి జడ్జి తన సొంత డబ్బులతో ఆ రుణాన్ని బ్యాంకు వారికి కట్టి మానవత్వం చాటుకున్నారు.
జడ్జి సాయానికి ఆ దంపతులు చేతులు జోడించి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: ఉచిత గ్రంథాలయాన్ని తెచ్చిన చిన్నారి ఆలోచన