ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి విజయం సాధించిన ఝార్ఖండ్ ముక్తి మోర్చాకు.. సీట్ల సంఖ్య పెరిగినప్పటికీ.. ఓట్లలో మాత్రం కోతపడింది. 2014 శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో 11 సీట్లు అదనంగా గెలుచుకుంది ముక్తి మోర్చా. ఓట్లలో మాత్రం 2 శాతం తగ్గిపోయాయి. 2014 శాసనసభ ఎన్నికల్లో 20 శాతం ఓట్లతో 19స్థానాల్లో నెగ్గిన జేఎమ్ఎమ్.. 2019లో 18శాతం ఓట్లతోనే 30 స్థానాలను దక్కించుకుంది.
ఓట్ల శాతం పెరిగినా ఓటమి తప్పలేదు
మరోవైపు భాజపా 2 శాతం మేర ఓట్లను పెంచుకున్నప్పటీ.. అధికారం కోల్పోక తప్పలేదు. 2014లో భాజపాకు 31 శాతం ఓట్లతో 37 సీట్లు దక్కగా.. ఈ సారి 33 శాతం ఓట్లు లభించాయి. అయినప్పటికీ కేవలం 25 స్థానాలనే దక్కించుకోగలిగింది. అటు కాంగ్రెస్ ఓట్ల పరంగా, సీట్ల పరంగానూ జోరు చూపించింది. 2014లో 10 శాతం ఓట్లతో 9 సీట్లు గెలిచిన కాంగ్రెస్.. 2019లో సుమారు 14 శాతం ఓట్లతో 16 స్థానాలు దక్కించుకుంది.
కూటమిగా ప్రభుత్వ ఏర్పాటు
ఝార్ఖండ్‌లో 81అసెంబ్లీ స్థానాలకు గానూ జేఎమ్ఎమ్ 30, కాంగ్రెస్ 16, రాష్ట్రీయ జనతా దల్ 1 స్థానం దక్కించుకున్నాయి. ఈ మూడు పార్టీలు హేమంత్ సోరెన్ నేతృత్వంలో కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి.