భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘చంద్రయాన్-2’ చివరి నిమిషంలో సాంకేతిక లోపంతో విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రుడిపై పరిశోధనలు చేపట్టేందుకు మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది ఇస్రో. ఇందులో భాగంగానే ‘చంద్రయాన్-3’కి ప్రణాళికలు రచిస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై తాజాగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మరింత స్పష్టతనిచ్చారు. 2020లో చంద్రయాన్-3 ప్రయోగం ఉంటుందని వెల్లడించారు.
‘అవును.. 2020లో మరోసారి ల్యాండర్, రోవర్ ప్రయోగం జరుగుతుంది. చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైందని చెప్పలేం. దాన్నుంచి ఎంతో నేర్చుకున్నాం. ఏ దేశమూ మొదటి ప్రయత్నంలోనే చంద్రుడిపై కాలుమోపలేదు. అమెరికా ఎన్నో సార్లు యత్నించింది’ అని జితేంద్ర సింగ్ చెప్పుకొచ్చారు. ప్రతిపాదిత చంద్రయాన్-3 ప్రయోగం కోసం నివేదికను తయారుచేయాలని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఇస్రోను అడిగినట్లు సమాచారం.
ఈ ఏడాది సెప్టెంబరు 7న విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్‌ను ప్రయత్నిస్తున్న సమయంలో చివరి నిమిషంలో దానితో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. ఈ హార్డ్ ల్యాండింగ్‌ను జితేంద్ర సింగ్ ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో అధికారికంగా ధ్రువీకరించారు.
ఇదీ చూడండి:కశ్మీర్‌పై సౌదీ వైఖరిలో మార్పు ఎందుకు?