ఝార్ఖండ్‌లో తుది దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. చివరిదైన ఐదో దశలో 16 శాసనసభ స్థానాలకు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. చలిని సైతం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఓటర్లు.
బరిలో 237 మంది...
16 స్థానాలకు మొత్తం 237 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 40,5,287 మంది ఓటర్లు తమ తీర్పుని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.
పటిష్ట భద్రత ఏర్పాటు..
పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. సమస్యాత్మక ప్రాంతాలైన బోరియో, బర్‌హెట్, లితిపార, మహేశ్‌పుర, శికారిపార నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగియనుంది. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
పోటీలో ప్రముఖులు..
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం ప్రముఖ నేత హేమంత్ సోరెన్‌తో పాటు ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దుమ్‌కా, బర్‌హెట్ రెండు స్థానాల్లో సోరెన్ ఎన్నికల బరిలో నిలవగా.. దుమ్‌కాలో సోరెన్‌కు పోటీగా భాజపా మహిళా నేత, శిశు సంక్షేమశాఖ మంత్రి లూయిస్ మరాండీ బరిలోకి దిగారు. ఝార్ఖండ్ వ్యవసాయశాఖ మంత్రి రాన్‌ధిర్‌సింగ్.. శరత్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
23న ఫలితాలు
ఝార్ఖండ్‌లోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు ఐదు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి.
ఇదీ చూడండి: 'నిజాం నిధుల కేసులో పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ'