ఝార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి ఆధికారం చేజిక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. 81 నియోజకవర్గాలున్న ఝార్ఖండ్ శాసనసభలో ఇప్పటికే అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది కూటమి. భాజపా ఎదురీదుతోంది.
ఎన్నికల ఫలితాలు సానుకూలంగా ఉండటం వల్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఆనందంలో మునిగి తేలుతున్నారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకుంటున్నారు.
దిగ్గజాల పరిస్థితి..
ఎన్నికల ఫలితాల్లో విజయంపై ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్... కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా జేఎంఎం నేత హేమంత్ సొరేన్‌ను ప్రకటించింది. హేమంత్... బోర్హైత్, దుంకా సీట్లల్లో దూసుకుపోతున్నారు.
తాజా ఫలితాలతో భాజపా గర్వం దిగుతుందని రాష్ట్ర కాంగ్రెస్ సమన్వయ కర్త అజయ్ శర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రఘుబర్ దాస్‌కు గడ్డుకాలం ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఆయన బరిలో దిగిన తూర్పు జంషెడ్పుర్లో స్వతంత్ర అభ్యర్థి సరయు రాయ్ ముందంజలో ఉన్నారు. సరయు భాజపా రెబల్ కావడం గమనార్హం. మరి కొందరు సీనియర్ భాజపా మంత్రులు సీపీ సింగ్, అనిల్ కుమార్ బౌరి ముందంజలో ఉండగా.. రాజ్ పాలివార్ వెనుకంజలో ఉన్నారు. గత అసెంబ్లీలో స్పీకర్‌గా ఉన్న దినేశ్ ఓరేన్ వెనుకంజలోనే ఉన్నారు.
81 స్థానాలున్న ఝార్ఖండ్ శాసనసభలో ప్రభుత్వ ఏర్పాటుకు 41 సీట్ల బలం ఉండాలి.
ఇదీ చూడండి:- 'మోదీ-షా.. దేశ ప్రజలను వెర్రివాళ్లను చేస్తున్నారా?'