బిహార్‌లో సుపరిపాలన, అభివృద్ధి పథకాల కొనసాగింపే లక్ష్యంగా.. అధికార పార్టీ జేడీయూ తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్నికల ప్రణాళికలో వివరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ప్రకటించిన ఎన్నికల వాగ్దానాలపై విమర్శలు గుప్పించారు. యువతకు 10 లక్షల ఉద్యోగాల కల్పన హామీతో సహా మహాకూటమి ప్రకటించిన ఎన్నికల హామీలు నెరవేర్చాలంటే.. 5 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అన్నారు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అధికారంలోకి వస్తే మధ్యపాన నిషేధంపై ఉన్న చట్టాలను సమీక్షిస్తామని చెబుతూ.. ఎన్నికల మేనిఫెస్టోపై మహాత్మ గాంధీ ఫోటోను పెట్టడం ఆయన ఆశయాలను అవమానించడమేనని ఆరోపించారు. గత ఐదేళ్లలో ప్రజాదరణ పొందిన ఏడు అభివృద్ధి పథకాలను.. అధికారంలోకి వచ్చాక తిరిగి కొనసాగిస్తామని నితీశ్ హామీ ఇచ్చారు.
ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి సరఫరా, శౌచాలయం నిర్మాణాలు పూర్తయినట్లు చెప్పారు నితీశ్. మహిళా సాధికారత కోసం 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను 100 నుంచి 200 రోజులకు పెంచుతామని వాగ్దానం చేశారు.
ఇదీ చూడండి: బిహార్ బరి: 'ఎల్జేపీ' ఎన్నికల మేనిఫెస్టో ఇదే..