కన్నడ నాట రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి. గతేడాది జూన్‌లో ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి ఒడుదొడుకుల్లోనే సాగిన కుమారస్వామి ప్రభుత్వం చివరిదశకు చేరుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి.
శనివారం ముగ్గురు జేడీఎస్ సభ్యులతో సహా 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి సంకీర్ణ ప్రభుత్వాన్ని సందిగ్ధంలో పడేశారు. వారం కిందటే ఓ కాంగ్రెస్ శాసనసభ్యుని రాజనామాతో ఆ సంఖ్య 14కు చేరింది.
ప్రభుత్వ ఏర్పాటు నుంచే...
ఆరంభం నుంచి కూటమిలో వైరుద్ధ్యాలున్నా.. లోక్‌సభ ఎన్నికల అనంతరం అది తీవ్రమైంది. అంతర్గత కలహాలు, మాటలయుద్ధాలు, కాంగ్రెస్ నేతల వివాదస్పద వ్యాఖ్యలతో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి స్థిరత్వం దెబ్బతింది. ఇదే అదనుగా కూటమిని కూలదోసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నాలు సాగించాయి. సమయం చిక్కినప్పుడల్లా.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ అసంతృప్తుల్ని తమలో చేర్చుకునే దిశగా ప్రణాళికలు రచించాయి.
దీనికి తోడు లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ పార్టీ అంచనాలకు మించి రాణించడం కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని సందిగ్ధంలో పడేసింది. అనంతరం.. కూటమి స్థిరత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం స్థిరంగా ఉంటుందా...? కూలిపోనుందా..? అనే ప్రశ్నలు అందరినీ ఆలోచనలో పడేశాయి.
వరుస రాజీనామాలు...
శనివారం మొత్తం అత్యంత నాటకీయ పరిణామాలు సాగాయి. ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రామలింగారెడ్డి నేతృత్వంలో 10 మంది శాసనసభ్యులు, జేడీఎస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు హెచ్. విశ్వనాథ్ ఆధ్వర్యంలో ముగ్గురు జనతా దళ్ సభ్యులు.. స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు. సభాపతి లేనందున కార్యదర్శికి రాజీనామాలు అందజేశారు. అనంతరం గవర్నర్ వాజూబాయివాలానూ కలిసి రాజీనామాలు సమర్పించారు.
అసంతృప్తుల్ని బుజ్జగించేందుకు కాంగ్రెస్ మంత్రి డీకే. శివకుమార్ స్పీకర్ కార్యాలయానికి వెళ్లినా ప్రయత్నాలు ఫలించలేదు. వారినెవరూ నిలువరించలేకపోయారు.
గోవా.. కాదు కాదు ముంబయి..
గవర్నర్‌కు రాజీనామాలు సమర్పించిన అనంతరం.. 10 మంది ఎమ్మెల్యేలు మొదట బెంగళూరు నుంచి గోవా వెళ్లాలని నిశ్చయించుకున్నారు. అనంతరం.. నిర్ణయం మార్చుకొని ముంబయికి చేరుకున్నారు. రాజీనామాలు చేసిన ముగ్గురు కాంగ్రెస్ శాసనసభ్యులు బెంగళూరులోనే ఉండిపోయారు.
స్పీకర్ నిర్ణయం మంగళవారం...
రాజీనామాలను స్వీకరించిన స్పీకర్.. మంగళవారం వీటిపై విచారణ చేపడతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ రాజీనామాలను ఆమోదిస్తే ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.
తగ్గనున్న మెజారిటీ...
రాజీనామాలు ఆమోదిస్తే.. విధాన సభలో సంకీర్ణ సర్కార్ బలం తగ్గిపోతుంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో భాజపా బల నిరూపణకు పట్టుబడితే.. సర్కార్ కూలిపోయే అవకాశముంది. గవర్నర్ ఆహ్వానిస్తే.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించిన కాషాయ పార్టీ.. రాజీనామాలతో తమకేం సంబంధం లేదని అంటోంది.
- 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తుతం కూటమి ఎమ్మెల్యేలు 118 మంది. మేజిక్ నంబరు కంటే ఇది 5 స్థానాలు అధికం.
- 14 మంది రాజీనామాల్ని స్పీకర్ ఆమోదిస్తే.. సంకీర్ణ కూటమి బలం 104కు పడిపోతుంది. అప్పుడు 210 స్థానాల అసెంబ్లీలో మేజిక్ సంఖ్య 106కు రెండడుగుల దూరంలో నిలిచిపోతుంది కుమారస్వామి సర్కార్.
కాంగ్రెస్ ప్రయత్నాలు...
14 మంది శాసనసభ్యుల రాజీనామాతో సంక్షోభంలో చిక్కుకున్న కర్ణాటక ప్రభుత్వాన్ని.. కాపాడుకునే దిశగా ప్రయత్నాలు చేపట్టింది హస్తం పార్టీ. తిరుగుబాటు ఎమ్మెల్యేలు ముంబయి వెళ్లగా.. తాజా పరిణామాలపై కాంగ్రెస్ నేతలు బెంగళూరులో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అసంతృప్త ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
కర్ణాటక ప్రస్తుత పరిస్థితిపై దిల్లీలో కాంగ్రెస్ సీనియర్లు భేటీ అయ్యారు. చిదంబరం, మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్‌లు సమావేశమై చర్చించారు. భాజపా అగ్రనాయకత్వం, మోదీ కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరుగుతోందని విమర్శించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా.