కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో ప్రధాని మోదీ ‘జనతా కర్ఫ్యూ’కి పిలుపునిచ్చారు. ఈ ఆదివారం ప్రజలంతా 14 గంటలపాటు బయటకు రాకుండా ఉండాలని కోరారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వాలని ముఖ్యమంత్రులు, అధికారులూ స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి ఒక్కరోజే కాదు... కరోనా నేపథ్యంలో రానున్న కొన్నిరోజులు, వారాలపాటు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాల్సి రావచ్చు. అనుకోకుండా దొరికిన ఈ అవకాశాన్ని ఆరోగ్యకరంగా , ఆనందకరంగా మలచుకుందాం. మరి అందుకోసం ఏమేం చేయవచ్చు...
అవగాహన పెంచుదాం
కరోనా, దాని వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కుటుంబసభ్యుల్లో అవగాహన కల్పించొచ్చు.
వ్యాయామం
రోజూ చేసే సమయంకంటే కొద్ది ఎక్కువ సమయం వ్యాయామానికి కేటాయించొచ్చు. యోగా చేేసే వారు ఏదైనా కొత్త ఆసనాన్ని ప్రారంభించొచ్చు.
కలివిడిగా వంట
ఇంట్లో ప్రతిరోజూ వంటతో ఆడవారే అలసిపోతుంటారు. మీరు వారికి సాయం చేయొచ్చు. ముఖ్యంగా ఉద్యోగినులు, ఇంటిపనులతో సతమతమయ్యే గృహిణులు... కొన్ని పనులను కుటుంబ సభ్యులకు అప్పగించి కొన్ని గంటలపాటైనా హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. కంటినిండా నిద్రపోవచ్చు.
పుస్తకంలోకి తొంగిచూద్దాం
ఉరుకులు పరుగుల జీవితాల్లో పుస్తకాలు చదడం కష్టమవుతోంది. ఓ మంచి పుస్తకాన్ని మనసారా ఓపట్టు పట్టొచ్చు.
శుభ్రం చేద్దాం
పిల్లలకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను నొక్కిచెప్పే పని పెట్టుకుందాం. ఎప్పటినుంచో పెండింగులో పెట్టిన శుభ్రత కార్యక్రమాలన్నింటినీ ఇంటిల్లిపాదీ కలిసి చేయొచ్చు. రోజూ వాడుకునే స్నానపుగదులు మురికిగా మారి ఉండొచ్చు. పిల్లలతో కలిసి వాటిని కడిగేయండి.
హాబీలను ఆస్వాదిద్దాం
పిల్లలతో బొమ్మలు గీయిద్దాం. మనమూ కుంచెను తీసుకుని రంగులద్దొచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఏవైనా హుషారెత్తించే పాటలకు నృత్యం చేయొచ్చు.మనసుకు ఆహ్లాదం కలిగించే, శ్రావ్యమైన పాటలను ప్రశాంతంగా ఆస్వాదిస్తూ, ఇష్టమైతే పాడుకోనూవచ్చు.
పత్రికను ఆసాంతం చదువుదాం
తీరిక దొరకని కారణంగా వార్తా పత్రికలోని శీర్షికలు చదవడానికే పరిమితమయ్యే వారు ఈరోజు ఆసాంతం చదవొచ్చు. పత్రికల్లో కరోనా గురించి అవగాహన పెంచుకునేలా ఎన్నో శాస్త్రీయమైన, ప్రామాణికమైన అంశాలు ఇస్తున్నారు. వాటిని చదివి అవగాహన పెంచుకోవచ్చు.
లేఖలు రాద్దాం
పిల్లలూ... మీరు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, పెద్దమ్మ, పెదనాన్నలతో తరచూ ఫోన్‌లో మాట్లాడుతుంటారు కదా. ఈరోజు సరదాగా ఒక ఉత్తరం రాయొచ్చు. దినపత్రికలకూ ఉత్తరాలు రాయొచ్చు.
ప్లాస్టిక్‌ను ఏరేద్దాం
రకరకాల మార్గాల్లో మనింట్లోకి వచ్చి చేరిన ప్లాస్టిక్ కవర్లు, సీసాలు, డబ్బాలు ప్రతి మూలకు చేరుతున్నాయి. వాటిని ఎవరు ఎక్కువ ఏరివేస్తే వారికి బహుమతులు ఇస్తామంటూ పిల్లల మధ్య పోటీ పెట్టొచ్చు.
తెలుగు నేర్పిద్దాం
ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న పిల్లలు తెలుగును మరచిపోతున్నారు. వారితో తెలుగులో ఉన్న చిన్నచిన్న కథలు, కవితల పుస్తకాలను ఆసక్తికరంగా, ఉత్సాహంగా చదివించొచ్చు.
ఆడుదాం అష్టాచెమ్మ
ఇంట్లోనే ఆడుకోవడానికి అనువైన సంప్రదాయ ఆటలైన అష్టాచెమ్మ, వైకుంఠపాళీ, పులి-మేక, వామనగుండ్లు(ఒనగండ్లు), చెస్, క్యారమ్స్ లాంటి వాటిని పిల్లలతో కలిసి ఆడొచ్చు.
ప్రకృతి సేవ
ఇంటి పెరడు, అపార్టుమెంట్ల ఆవరణల్లో మొక్కలకు పిల్లలతో నీళ్లు పోయించవచ్చు. పాదులను శుభ్రం చేయించవచ్చు. కొత్త మొక్కలనూ నాటొచ్చు.
క్యాండిల్ వెలుగులో విందు
ప్రజలంతా ఇళ్లలోనే ఉన్నారు. విద్యుత్తును తెగ వాడేస్తారు. సరఫరాపై తీవ్ర ఒత్తిడి పెరగొచ్చు. రాత్రి భోజనాన్ని ఆహ్లదంగా క్యాండిల్ లైట్ డిన్నర్‌గా మార్చుకుంటే కొత్త అనుభూతిని పొందొచ్చు. విద్యుత్తునూ ఆదా చేయొచ్చు.అలసి సొలసి హాయిగా నిద్రలోకి జారుకోవచ్చు. తెల్లవారుజామున గతంలో ఎన్నడూ లేనంత ఉల్లాసంగా మేల్కొనవచ్చు.